Free Seat Selection Policy: విమానయాన సంస్థలు కనీసం 60% సీట్ల సెలక్షన్ విషయంలో ఎలాంటి అదనపు ఛార్జ్ వసూలు చేయకూడదంటూ కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను విమానయాన సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (FIA) తన సభ్యులైన ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ తరపున భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విమానయాన సంస్థల సంఘం వాదించింది. సీట్ల ఎంపిక ఛార్జ్ అనేది విమానయాన సంస్థల ఆదాయంలో ఒక చట్టబద్ధమైన భాగం అని చెప్పుకొచ్చాయి. ఒకవేళ ఈ ఛార్జీలను రద్దు చేస్తే, ఫ్యూయెల్, విమానాశ్రయ ఛార్జీలు సహా నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ అభిప్రాయపడింది. ” 60 శాతం సీట్ సెలెక్షన్ ఫీజు ఉండకూడదనే కేంద్రం నిర్ణయం విమానయాన సంస్థలపై ప్రభావం గణనీయంగా ఉంటుంది. దీనివల్ల కోల్పోయిన ఆదాయాన్ని ఛార్జీల పెంపు ద్వారా తిరిగి రాబట్టుకోవాల్సి వస్తుంది. ఫలితంగా, సీట్లను ముందుగా ఎంచుకోవడానికి ఇష్టపడని వారితో సహా ప్రయాణీకులందరూ అధిక ఛార్జీలు చెల్లించవలసి వస్తుంది” అని వాదించింది.
ప్రస్తుతం, వెబ్ చెక్ ఇన్ సమయంలో దాదాపు అన్ని టిక్కెట్లపై సీటు ఎంపిక ఛార్జ్ పడుతుంది. అయితే, విశాలమైన లెగ్ రూమ్ లాంటి సౌకర్యం కోసం అదనపు ఛార్జీ విధించే కొన్ని సీట్లు మినహా, మిగతా సీట్లు రాండమ్ గా కేటాయించుకునే అవకాశం ఉంటుంది. ఉచిత సీటు ఎంపిక అనేది మొదట్లో లాభంగా అనిపించినా, ప్రయాణీకులందరిపై ఛార్జీల ప్రభావం పడేలా చేస్తుందని ఫెడరేషన్ వెల్లడించింది. ఇప్పటికే సీటు ఎంపిక రుసుముపై విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే విమాన సంస్థల సంఘం కేంద్రానికి లేఖ రాయడం ఆసక్తి కలిగిస్తుంది.
అటు విమాన ఛార్జీలకు సంబంధించి ఫిబ్రవరి 12న లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానాన్ని ఎయిర్‌లైన్స్ ఫెడరేషన్ ప్రస్తావించింది. ఆ సమాధానంలో, విమాన ఛార్జీలు ప్రభుత్వ నియంత్రణలో లేవని, నిబంధనలకు లోబడి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను నిర్ణయించుకునే స్వేచ్ఛ విమానయాన సంస్థలకు ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం సాధారణంగా మార్కెట్ పోటీని కాపాడటానికి ఛార్జీల నియంత్రణకు దూరంగా ఉన్నప్పటికీ, కొన్ని అసాధారణ పరిస్థితులలో తాత్కాలిక ఛార్జీల పరిమితుల విషయంలో జోక్యం చేసుకుంటుందని, అదే విధానాన్ని కొనసాగించాలని కోరుతుంది.
సీటు ఎంపిక ఛార్జ్ తొలగింపు విషయంలో విమానయాన సంస్థలకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదని, మంత్రిత్వ శాఖ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఎయిర్‌లైన్స్ ఫెడరేషన్ వెల్లడించింది. ఈ నిర్ణయం అమలు అయితే, విమాన సంస్థలకు భారీగా నష్టం కలుగుతుందని చెప్పుకొచ్చింది. డీజీసీఏకు ఇచ్చిన ఈ ఆదేశాన్ని ఉపసంహరించుకుని, ప్రస్తుతం ఉన్న నిబంధనలనే కొనసాగించాలని ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Read Also: 7 దేశాల్లో విమానాల అంతరాయం, నరకం చూసిన వేలాది మంది ప్రయాణికులు!