మనదేశంలో ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్‌గా పేరు తెచ్చుకుంది గోవా. అయితే గోవా పోలీసులు కఠిన రూల్స్ అమల్లోకి తీసుకొచ్చారు. ఇకపై అక్కడికి వెళ్లే పర్యాటకులు ఇతరుల అనుమతి లేకుండా ఫోటోలు తీయడం లేదా సెల్ఫీలు తీసుకోవడం చేస్తే కఠిన చర్యలు తప్పవని గోవా పోలీసులు హెచ్చరించారు. గోవా బీచ్‌లలో, ముఖ్యంగా విదేశీ మహిళలతో బలవంతంగా ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీయడం వంటి ఘటనలు పెరిగాయి. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
పోలీసుల చెబుతున్న ప్రకారం ఎవరికైనా అనుమతి లేకుండా ఫోటోలు తీయడం వారి వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం అవుతుంది. ఇది చట్టపరంగా తప్పు మాత్రమే కాదు, వేధింపులుగా కూడా పరిగణిస్తారు. అందుకే ఇటువంటి పనులు చేసే వారిని వెంటనే అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల గోవాలోని బాగా, కాలంగూట్ వంటి బీచ్‌లలో కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో పర్యాటకులు విదేశీ మహిళలను బలవంతంగా సెల్ఫీలకు ఒప్పించడం, వీడియోలు తీయడం జరిగింది.
Also read: Parenting: పబ్లిక్‌లో అందరిముందు పిల్లలను తిట్టడం ఎంత ప్రమాదమో తెలుసా?
ఇలాంటి పనులు చేయడం వల్లే
ఒక ఘటనలో ఓ వ్యక్తి ఒక విదేశీ మహిళ ఈత కొడుతున్న సమయంలో ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరో ఘటనలో కొంతమంది పర్యాటకులు బలవంతంగా ఫోటోలు తీసేందుకు ప్రయత్నించినందుకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పెరగడంతో గోవా పోలీసులు బీచ్‌లలో గస్తీని పెంచారు. ముఖ్యంగా ఉత్తర గోవా ప్రాంతాల్లో పోలీసుల భారీగా కాపు కాస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ముందుగా అనుమతి తీసుకుని
ఎవరితోనైనా ఫోటో తీసుకోవాలంటే ముందుగా వారి అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ఫోటో తీయడం, వీడియో తీయడం, సెల్ఫీకి బలవంతం చేయడం వంటివన్నీ ఇవి నేరాలుగా పరిగణిస్తారు. ఇలాంటి పనులు చేస్తే వెంటనే అరెస్ట్ చేయవచ్చు. ఈ రూల్స్ వెనుక ప్రధాన ఉద్దేశ్యం గోవాలో పర్యాటకులకు భద్రత కల్పించడం. గోవా ఒక అంతర్జాతీయ టూరిస్ట్ ప్రదేశం కావడంతో, అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులు సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు.
గోవా వెళ్లే వారు ఈ కొత్త రూల్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇతరుల ప్రైవసీని గౌరవించడం చాలా ముఖ్యం. సరదాగా తీసిన ఫోటో కూడా సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా అనుమతి తీసుకుని మాత్రమే ఫోటోలు తీయడం మంచిది. లేదంటే గోవా ట్రిప్ ఆనందంగా కాకుండా ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది.