జార్ఖండ్ లో తృటిలో పెను రైలు ప్రమాదం తప్పింది. రూర్కెలా నుంచి బొకారోకు ఇనుప ఖనిజాన్ని తీసుకువెళ్తున్న గూడ్స్ రైలు సిమ్ దేగాలోని కనారోవన్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 వ్యాగన్లు పట్టాల తప్పాయి. వీటిలో సుమారు ఏడు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 100 మీటర్ల మేర రెండు రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో హటియా-రూర్కెలా సెక్షన్ లో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అటు గూడ్స్ రైలు వెనుకాలే పూరి-హటియా తపస్వి ఎక్స్ ప్రెస్ ప్రయాణించింది. స్టేషన్లలో ఆగడం మూలంగా ఈ రైలు కాస్త వెనకబడింది. అదే సమయంలో ముందుకు వెళ్లిన గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ విషయం తెలియక లోకో పైలెట్ రైలును అదే మార్గంలో తీసుకొచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన రైల్వే అధికారులు.. లోకో పైలెట్ కు సమాచారం అందించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయాన్ని అతడికి చెప్పారు. వెంటనే ఈ రైలును తాటి స్టేషన్‌లో ఆపాడు. తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఎక్స్ ప్రెస్ లోని ప్రయాణీకులతో పాటు రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, రైల్వేలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్, స్లీపర్లు, ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు, సిగ్నల్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పట్టాలు తప్పడానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియదు. అధికారుల బృందం ఈ ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు. త్వరలోనే ఈ ప్రమాదానికి అసలు కారణాలను వెలికితీయనున్నారు. బానో పోలీస్ స్టేషన్ పరిధిలోని కనారోన్ రైల్వే స్టేషన్ నార్త్ క్యాబిన్ సమీపంలో బుధవారం ఉదయం 10:13 గంటలకు ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. రూర్కెలా నుంచి బొకారోకు ఇనుప ఖనిజాన్ని తీసుకువెళుతున్న సరుకు రవాణా రైలు 524/29- 524/36 స్తంభాల మధ్య అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తర్వాత, RPF, GRP బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతను ఏర్పాటు చేశాయి. ప్రమాద స్థలంలోకి ఎవరినీ అనుమతించలేదు. హటియా రైల్వే డివిజన్‌లోని DRM సహా సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. శిథిలాలను తొలగించి ట్రాక్ మరమ్మతు చేసే పనిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు.
ఈ ప్రమాదం కారణంగా సుమారు 11 రైలు సర్వీసులు ప్రభావితం అయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తపస్విని ఎక్స్ ప్రెస్ ను తాటి స్టేషన్ లో నిలిపివేసి ఒడిశాలోని రూర్కెలాకు తిరిగి పంపించారు. రూర్కెలా స్టేషన్ లో ప్రయాణికులను హటియాకు తీసుకురావడానికి బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ మార్గంలో నడిచే హటియా-రూర్కెలా ప్యాసింజర్, హటియా-సంకి-హటియా ప్యాసింజర్ రద్దు చేశారు. హటియా-జార్సుగూడ మెము రైలును తాత్కాలికంగా నిలిపివేశారు. సంబల్‌పూర్-గోరఖ్‌పూర్ మౌర్య ఎక్స్ ప్రెస్ (15027), విశాఖపట్నం-బనారస్ ఎక్స్‌ప్రెస్ (18523), సర్ ఎం విశ్వేశ్వరయ్య బెంగళూరు టెర్మినల్-హటియా ఎక్స్‌ప్రెస్ (12836), ధన్‌బాద్-అలప్పుళ ఎక్స్‌ప్రెస్ (13351) సహా తొమ్మిది రైళ్లను దారి మళ్లించారు.
Read Also: మొంథా ఎఫెక్ట్, వందేభారత్ సహా పలు రైల్వే సర్వీసులు బంద్!