 
					Lovers Suicide: రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలు మృతిని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. పంబాల నందిని (18), మంకు నాగరాజు (25) అనే యువజంట గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ప్రేమ గురించి ఇటీవల ఇరు కుటుంబాలకూ తెలిసింది. పెద్దలు వారిని సముదాయిస్తూ.. ఇంట్లో ముందుగా పెళ్లి కావాల్సిన వారు ఉన్నారు, కొంతకాలం ఆగండి అని సూచించారు. దీంతో మనస్తాపానికి గురై, సోమవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నందిని మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో నందిని కుటుంబం నాగరాజుపై ఆరోపణలు చేస్తూ.. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టింది. తమ కుమార్తె చావుకు కారణం అతడేనని వారు ఆరోపించారు.
ఈ విషయం తెలిసిన నాగరాజు తీవ్ర వేదనకు గురయ్యాడు. ప్రియురాలిని కోల్పోయిన దుఃఖం ఒకవైపు, తనపై వస్తున్న ఆరోపణలు మరోవైపు అతనిని మానసికంగా క్రుంగదీశాయి. బుధవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. నాగరాజు మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో యువతీ, యువకులకు పలు సూచనలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని, కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రేమలో విఫలమై ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని అధికారులు హెచ్చరించారు.
Also Read: అడ్డంగా దొరికిపోయారు ఆ దంపతులు.. యువకుడ్ని కారుతో గుద్ది, అసలు విషయం ఏంటంటే..
కాగా రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ ప్రేమజంట ఆత్మహత్యలతో.. ఆరుట్ల గ్రామం మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. రెండు కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యారు.