తెలంగాణ ఎన్నో అద్భుతమైన జలపాతాలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా జలపాతాలు పరవళ్లు తొక్కుతూ అలరిస్తున్నాయి. మిగతా వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నా, బ్లూ వాటర్ ఫాల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణలోనే ఇది అత్యంత అందమైన జలపాతంగా గుర్తింపు తెచ్చుకుంది. కీకారణ్యం నుంచి జాలువారుతూ వచ్చే ఈ జలపాతం నీళ్లు.. నీలిరంగులో సముద్ర జలాల మాదిరిగా ఆకట్టుకుంటాయి. విదేశాల్లో మాదిరిగా ఉండే ఈ వాటర్ ఫాల్స్ చూస్తే మైమరచిపోవాల్సిందే
ఈ బ్లూ వాటర్ ఫాల్స్ ను తిర్యాణి జలపాతం అని పిలుస్తారు. ఇది కుమురం భీం జిల్లాలోని తిర్యాణి మండలంలోని గుండాల పరిధిలో ఉంటుంది. ఇక్కడ మూడు జలపాతాలు ఉంటాయి. గుండాల, ఉల్లిపిట్ట, చింతమాదర జలతాలు. వీటన్నింటిని కలిపి తిర్యాణి వాటర్ ఫాల్స్ గా పిలుస్తారు. ఇందులోని గుండాల జలపాతంలో 50 అడుగుల ఎత్తులోంచి నీలి రంగు నీళ్లు కిందికి జాలువారుతుంటాయి. చూపరులను ఈ దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తిర్యాణి నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న ఈ జలపాతాలు పచ్చని కొండల మధ్యలో ఉండి, వర్షాకాలంలో అత్యంత అద్భుతంగా ఆకట్టుకుంటుంది. చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇక్కడికి రాకపోకలపై ఎలాంటి నియంత్రణలు లేవు.
తిర్యాణి వాటర్ ఫాల్స్ చూడాలంటే కుమురం భీం జిల్లా కేంద్రం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిర్యాణి మండల కేంద్రానికి వెళ్లాలి. అక్కడి నుంచి గుండాల జలపాతం దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిర్యాణి మండల కేంద్ర నుంచి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న రోంపపల్లి గ్రామం వరకు బస్సులోలో వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 9 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. రాళ్ల మధ్యలో నుంచి జాలువారే ఈ జలపాతం తెలంగాణలోని అందమైన జలపాతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
భారీ వర్షాలు కురిసిన తర్వాత అంటే జూన్ – నవంబర్ వరకు ఈ బ్లూ వాటర్ ఫాల్స్ ఉద్ధృతంగా ప్రవహిస్తాయి. ఈ సమయంలో చూడ్డానికి వెళ్తే ఎంతో బాగుంటుంది. ప్రకృతి అందాల నడుమ ఎంతో అద్భుతంగా అలరిస్తుంది. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులకు ఈ వాటర్ ఫాల్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నవంబర్ సమయంలో ఈ వాటర్ ఫాల్స్ మరింత అందంగా కనిపిస్తాయి. ఎంతో మంది ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. గత కొంతకాలంగా ఇక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతోంది. తిర్యాణి మండల కేంద్రం నుంచి 19 కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ వాటర్ ఫాల్స్.. హైదరాబాద్ నుంచి సుమారు 300 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. హాలీడేస్ లో లేదంటే వీకెండ్స్ లో ఉదయం వెళ్లి, సాయంత్రంలోగా తిరిగి రావచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫ్రెండ్స్ తో లేదంటే ఫ్యామిలీస్ తో ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లి ఎంజాయ్ చేసేయండి.
Read Also: కార్వాన్ కాంపెన్ To క్యాంప్ ఫైర్ విత్ తంబోలా.. ఒక్కసారైనా ఈ క్రేజీ ఎక్స్ పీరియెన్స్ చేయాల్సిందే!