Maha Kumbh Stampede 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగరాజ్ కు వెళ్లే తాత్కాలిక రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మౌని అమావాస్య కావడంతో కుంభమేళాకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో పలువురు భక్తులు చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు, భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు రైల్వేశాఖ తాత్కాలిక రైళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అటు మహా కుంభమేళాకు వెళ్లే పలు రైళ్లను మధ్యలోనే నిలిపివేశారు.
రైళ్ల రద్దు తాత్కాలికమే!
మౌని అమవాస్య కావడంతో లక్షలాది మంది భక్తులు ప్రయాగరాజ్ కు తరలి వచ్చారు. ప్రభుత్వ పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్ల నిలిపివేత కారణంగా కొంత రద్దీని తగ్గించే అవకాశం ఉందని రైల్వేశాఖ భావిస్తున్నది. అయితే, రైళ్ల రద్దు తాత్కాలికమేనని, ప్రయాగరాజ్ లో పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ కొనసాగిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే, రైళ్ల రద్దుతో ప్రయాగరాజ్ లో పలువురు ప్రయాణీకులు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.
తొక్కిసలాటలో 15 మంది భక్తులు మృతి
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 15 మంది భక్తులు చనిపోయారు. ఇవాళ మౌని అమావాస్య కావడంతో ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం దగ్గర పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రయాగరాజ్ సెక్టార్ 2 దగ్గర తెల్లవారు జామున తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు విరిగిపోవడంతో భక్తులు ఒకరిమీద మరొకరు పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్సులలో సమీప ఆస్పత్రులకు తరలించారు. అటు మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కుంభమేళా తొక్కిసలాటపై ప్రధాని మోడీ ఆరా
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో ఫోన్ లో మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు. కుంభమేళాలో ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు చేరవేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం యోగితో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణసాయం అందించాలన్నారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.
కొద్ది గంటల పాటు స్నానాలు నిలిపివేత
అటు తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో అధికారులు కాసేపు అమృత స్నానాలను నిలిపివేశారు. సెక్టార్ 2లో పరిస్థితులు పూర్తిగా కంట్రోల్ అయ్యేంత వరకు భక్తులను అనుమతించలేదు. క్షతగాత్రులను అక్కడి నుంచి తరలించిన తర్వాత భక్తులను మళ్లీ పుణ్య స్నానాలు చేసేందుకు అనుమతించారు. నిన్న ఒక్క రోజే త్రివేణి సంగమంలో 5.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
Read Also: ఢిల్లీ నుంచి ఒక్క రోజులో చుట్టేసే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!