UAE Tour: ఎడారి దేశం యుఏఈకి ప్రతి ఏటా లక్షలాది మంది భారతీయ పర్యాటకులు వెళ్తుంటారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఎడారిలో అడ్వెంచరస్ ఈవెంట్లలో పాల్గొని సరదాగా గడుపుతుంటారు. అయితే, ముస్లీం కంట్రీ యుఏఈలో చాలా మంది పర్యాటకులు తెలియకుండా రకరకాల తప్పులు చేస్తుంటారు. ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంతకీ అక్కడ పర్యాటకులు చేసే సాధారణ తప్పులు ఏంటి? వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం..
⦿ మసీదులను పర్యాటక ప్రదేశాలుగా చూడొద్దు
యుఏఈలో పర్యాటకులు చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటి మసీదులను సాధారణ సందర్శనా ప్రదేశాలుగా పరిగణించడం. అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు లాంటి ఐకానిక్ ల్యాండ్ మార్క్‌ల దగ్గర అనుచితమైన దుస్తులు ధరించడం, బిగ్గరగా మాట్లాడటం, ఫోటోలు తీయడం అగౌరవంగా భావిస్తారు. ప్రార్థనా ప్రాంతాల లోపల ఫోటోలు తీయకూడదు. మతపరమైన ప్రదేశాలను గౌరవించాలి. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలిగించకుండా చూసుకోవాలి.
⦿ డ్రెస్ కోడ్ పాటించకపోవడం
యుఏఈలో సాంప్రదాయ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పబ్లిక్ ప్రదేశాల్లో చిన్న బట్టలు, స్లీవ్ లెస్ టాప్స్ ధరించడం మంచిది కాదు. వీలైనంత వరకు మోకాళ్లు, భుజాలు కప్పే దుస్తులు ధరించాలి. మసీదులకు వెళ్తే మహిళలు తలకు స్కార్ఫ్ ఉపయోగించాలి.
⦿ పబ్లిక్‌లో సన్నిహితంగా ఉండటం
యుఏఈలో పబ్లిక్ ప్రదేశాల్లో చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంచి చర్యలు నిషేధం. చట్టవిరుద్ధం కూడా. ఇలాంటి పనులు చేసే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు పబ్లిక్ లో ఇలాంటి చర్యలను పూర్తిగా నివారించండి.
⦿ రంజాన్ నియమాలను గౌరవించకపోవడం
యూఏఈలో రంజాన్ మాసంలో నిబంధనలను కఠినంగా ఫాలో అవుతారు. అందుకే, పబ్లిక్ లో తినడం, తాగడం, ధూమపానం చేయడంపై కచ్చితంగా నిషేధం ఉంటుంది. ఒకవేళ మీరు ఇందులో ఏ పని చేసినా స్థానిక సంస్కృతిని అగౌరవపరిచినట్లు భావిస్తారు. అందుకే, రంజాన్ సమయంలో పగటిపూట పబ్లిక్ లో తినడం, తాగడం మానేయాలి. హోటళ్లలోని ప్రైవేట్ ఏరియాలు లేదంటే ఇంట్లో తినండం మంచిది.
⦿ఫోటోలు తీయడంలో అజాగ్రత్త
యూఏఈలో స్థానికులను, ముఖ్యంగా మహిళలను, ప్రభుత్వ భవనాలను, సైనిక స్థావరాలను ఫోటోలు తీయడం చట్టవిరుద్ధం. ఇలా చేయడం గోప్యతను ఉల్లంఘించినట్లు భావిస్తారు. ఫోటోలు తీసే ముందు అనుమతి తీసుకోవాలి. నిషిద్ధ ప్రదేశాల్లో ఫోటోలు తీయకూడదు.
⦿ మద్యం సేవించడంలో నియమాలు ఉల్లంఘించడం
యూఏఈలో మద్యం తాగడం కఠిన నిబంధనల కింద ఉంటుంది. పబ్లిక్‌లో మద్యం తాగడం, మత్తులో ఉండటం చట్టవిరుద్ధం. కఠిన శిక్షలు అమలు చేస్తారు. లైసెన్స్ ఉన్న హోటళ్లు, బార్లలో మాత్రమే మద్యం తాగాలి. పబ్లిక్ లో మద్యం తీసుకెళ్లడం, తాగడం చేయకూడదు.
⦿ స్థానిక సంస్కృతిని అగౌరవపరచడం
యూఏఈలో మతం, సంస్కృతి, సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. స్థానిక ఆచారాలను విమర్శించడం, అనుచిత భాష వాడటం, అగౌరవంగా ప్రవర్తించడం చేయకూడదు. స్థానిక సంస్కృతిని గౌరవించండి. మర్యాదగా ప్రవర్తించండి. స్థానిక నియమాల గురించి ముందుగా తెలుసుకోని వ్యవహరించడం మంచిది. హ్యాపీగా యూఏఈ టూర్ ఎంజాయ్ చేయాలంటే ఈ విషయాలను కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి.
Read Also: ఆహా అనిపించే అందమైన మడా అడవులు, మన దగ్గర కూడా ఉన్నాయండోయ్!