Bird Sanctuary: పక్షుల పట్ల ఆసక్తి ఉన్నవారు వలస పక్షుల అందమైన దృశ్యాలను చూసేందుకు చాలా ఇష్టపడతారు. ఇతర దేశాల్లో ఉండే పక్షులను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ, వాటిని చూడాలంటే ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుందని అనుకుంటారు. అయితే ఏపీకే వలస పక్షులు వస్తాయని తెలిసిన వారు చాలా అరుదుగా ఉంటారు. అక్కడికి ఇతర దేశాల నుంచి కూడా పక్షులు వలస వస్తాయి. ఆ ప్రదేశం ఎక్కడుందంటే..
తేలినీలాపురం, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఉన్న ఒక చిన్న గ్రామం, వలస పక్షుల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు ఒక అద్భుతమైన గమ్యస్థానంగా చెప్పుకోవచ్చు.
వలస పక్షులు
తేలినీలాపురం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సైబీరియా, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుండి వచ్చే సుమారు 3000 పెలికాన్ లు, పెయింటెడ్ స్టార్క్ ల ఆవాస స్థలంగా ఉంటుంది. ఈ పక్షులు శీతాకాలంలో ఆహారం, సంతానోత్పత్తి కోసం ఇక్కడకు వలస వస్తాయి. అక్టోబర్ లో వచ్చిన పక్షులు గూళ్లు కట్టడం, జతకట్టడం, డిసెంబర్ నాటికి పిల్లలను పొదిగి వాటికి ఈత, ఎగరడం నేర్పిస్తాయి. ఈ దృశ్యాలు పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని కలిగిస్తాయి. గతంలో 10,000 కు పైగా పక్షులు వచ్చేవని ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి, కానీ పర్యావరణ మార్పుల వల్ల క్రమంగా ఈ సంఖ్య తగ్గింది.
టూరిస్ట్ స్పాట్
తేలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం సుమారు 458 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ కొలను చుట్టూ బేరింగ్టోనియా చెట్లు, దక్షిణ శుష్క ఆకురాలని పొదలు పక్షులకు సహజ ఆవాసాన్ని కల్పిస్తాయి. పెలికాన్ లు, స్టార్కులతో పాటు, ఇతర అరుదైన పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు. సందర్శకుల కోసం చిన్న మ్యూజియం, గైడెడ్ టూర్లు, బోటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయ్. అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో పక్షుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండడంవల్ల ఇది ఉత్తమ సందర్శన సమయంగా చెప్పుకోవచ్చు.
తేలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం ప్రకృతి, పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు ఒక అద్భుతమైన గమ్యస్థానం అని చెప్పొచ్చు. సైబీరియా నుండి వచ్చే వలస పక్షుల అందమైన దృశ్యాలు, సులభమైన రవాణా సౌకర్యాలు, పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసే ఈ స్థలం పర్యాటకులకు మరపురాని అనుభవాన్ని అందిస్తుంది.
ఎలా వెళ్లాలి?
తేలినీలాపురం శ్రీకాకుళం నుండి 65 కి.మీ. విశాఖపట్నం నుండి 135 కి.మీ. దూరంలో ఉంది. రైలు మార్గంలో, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో ఉంది, ఇక్కడ నుండి ఆటో లేదా టాక్సీల ద్వారా 10-15 కి.మీ. ప్రయాణించి రోడ్డు మార్గంలో, విశాఖపట్నం లేదా శ్రీకాకుళం నుండి బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా వెళ్లొచ్చు.