విమాన ప్రమాదాలు జరిగిన తీరు చూశాక ఎంతో మంది భయబ్రాంతులకు గురవుతారు. అయినా విమానయానం చేయక తప్పని పరిస్థితి ఎంతోమందికి ఉంది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంతో ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకపోతున్నారు. విమాన ప్రయాణం వల్ల సమయం చాలా ఆదా అవుతుంది. అందుకే దూరప్రాంతాలకు వెళ్లేవారు విమానయానాన్ని ఎంపిక చేసుకుంటారు.
ఆక్సిజన్ మాస్క్ ఎందుకు?
విమానం టేకాఫ్ అయ్యే ముందు ఎయిర్ హోస్టెస్ కొన్ని నియమాలు, జాగ్రత్తలు చెబుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ మాస్కుని ఎలా ఉపయోగించాలో కూడా వివరిస్తుంది. ముఖ్యంగా విమానం ప్రమాదంలో పడినప్పుడు మంటలు చెలరేగినప్పుడు పొగ వస్తుంది. దాని నుంచి కాపాడుకోవాలంటే ఆక్సిజన్ మాస్క్ ను పెట్టుకోవాలి. ఈ ఆక్సిజన్ మాస్క్ సీటు పైనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు దీన్ని సులభంగా ఉపయోగించేలా దీన్ని డిజైన్ చేశారు. విమానంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ మాస్క్ అందుబాటులో ఉంటుంది.
విమానం ఎత్తుకు వెళితే
విమానంలో ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆక్సిజన్ మాస్కులను ఉపయోగిస్తూ ఉంటారు. విమానం 14 వేల అడుగులు లేదా అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు విమానంలో ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు పిల్లలు, పెద్దలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఆ సమయంలో ఆక్సిజన్ మాస్కులు ధరించమని ఎయిర్ హోస్టెస్ చెబుతూ ఉంటారు.
అత్యవసర పరిస్థితుల్లో కూడా మాస్క్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆక్సిజన్ మాస్కులు ప్రయాణికుల ప్రాణాన్ని ఎంతసేపు కాపాడగలవు అనే సందేహం ఎంతోమందికి ఉంటుంది.
ఎంతసేపు ఆక్సిజన్ అందుతుంది?
విమానంలో ఉన్న ఆక్సిజన్ మాస్క్ మీకు దాదాపు పావుగంట పాటు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. ఆ పావుగంట సమయంలో పైలట్ విమానాన్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఆక్సిజన్ మాస్కులు ఉపయోగించే అవసరం ఉండదు. అందుకే ప్రతి ఒక్కరికి పావుగంట పాటు ఆక్సిజన్ అవకాశాలను విమానంలో ఏర్పాటు చేశారు.