Telangana Mega Bullet Train Hub: హైదరాబాద్ సౌత్ ఇండియా బుల్లెట్ ట్రైన్ గేట్ వేగా మారబోతోంది. భాగ్యనగరంలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం దగ్గర బహదూ గూడ ప్రాంతాన్ని బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో హైదరాబాద్ ను ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలతో కలిపే హైస్పీడ్ రైళ్ల ఆపరేషన్స్ ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ ను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై వయా అమరావతి మార్గాల్లో బుల్లెట్ రైళ్లు నడిపే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కార్యకలాపాలకు ఒకే కేంద్రంగా ఉండేలా శంషాబాద్ సమీపంలోని బహదూర్ గూడను రైల్వే అధికారులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
బుల్లెట్ రైలు హబ్ నిర్మాణం కోసం విమానాశ్రయానికి దగ్గరలో ఉండే ప్రభుత్వ భూములను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు నెలల క్రితమే బుల్లెట్ ట్రైన్ హబ్ ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉండాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులు శంషాబాద్-తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు దగ్గరలోని బహదూర్ గూడ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఒకే చోట పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ఈ ప్రదేశానికి ప్లస్ పాయింట్ గా మారింది.
బహదూర్ గూడ లోని సర్వే నంబర్లు 62, 28ల పరిధిలో సుమారు 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బుల్లెట్ ట్రైన్ హబ్ నిర్మాణానికి కనీసం 400 నుంచి 500 ఎకరాల వరకు అవసరమని రైల్వే ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే బహదూర్ గూడ ప్రాంతాన్ని తుది ఎంపిక చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై సమగ్ర నివేదిక కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాంతం విమానాశ్రయ రన్ వేకు చాలా దగ్గరగా ఉండటంతో భవిష్యత్తులో ప్రయాణికులకు పెద్ద సౌకర్యంగా మారే అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్ లో వచ్చే వారు నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుంటుంది. అలాగే, విమానాల్లో వచ్చే ప్రయాణికులు కూడా సులభంగా బుల్లెట్ ట్రైన్ సేవలను వినియోగించుకోవచ్చు. రైల్వే లైన్ జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఇతర జిల్లాలకు వెళ్లే వారికి కూడా ప్రయాణం సౌకర్యవంతంగా మారనుంది.
ఇక మరోవైపు భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను నగర శివార్ల వరకే పరిమితం చేసి, అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ప్రయాణికులను నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు తరలించే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా బుల్లెట్ ట్రైన్ హబ్‌కు సమీపంలోనే సుమారు 150 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్ ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే బహదూర్ గూడ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
Read Also: గంటలో అమరావతి నుంచి హైదరాబాద్ ప్రయాణం, బుల్లెట్ రైలు రూట్ మ్యాప్ రెడీ!