Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. పాతబస్తీకి రూ.125 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 19 వేల 579 కోట్ల రూపాయలు. కారిడార్ 9లో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు ఉంది. కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు. కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల చొప్పున సెకండ్ ఫేజ్ పనులను చేపట్టనున్నారు.
తెలంగాణ వాటా 30 శాతం, కేంద్రం 18 శాతం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం 30శాతం ఖర్చు చేయనుండగా, కేంద్రం 18 శాతం, ఏడిబి, ఎన్డిబి, జైకా నుంచి 48 శాతం రుణం, పిపిపిలో మరో నాలుగు శాతం వాటాగా ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోసం త్వరలో పరిపాలన అనుమతిని డిపిఆర్‌కు జత చేసి పంపనుంది. 2025-26 బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు కేటాయించగా.. విడుదలలో భాగంగా ఓల్డ్ సిటీకి మెట్రో కనెక్టివిటీపై ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
ఓల్డ్ సిటీలో.. చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురాణి హవేలి
కాగా ఇటీవల పాతబస్తీలోని వారసత్వ కట్టడాల పరిరక్షణ చర్యలపై.. సమగ్ర అధ్యయనం చేయకుండానే మెట్రో పనులు ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పిల్ దాఖలైంది. యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నగర అభివృద్ధి ప్రణాళికలో వారసత్వ సంపద పరిరక్షణ ప్రాముఖ్యతపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓల్డ్ సిటీలో.. చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురాణి హవేలి, మొగల్‌పురా టూంబ్ లాంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని.. యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ హైకోర్టుకు విన్నవించింది. ఈ ప్రాజెక్టుల వల్ల చారిత్రక కట్టడాల పునాదులు దెబ్బతినే అవకాశం ఉందని.. వాటి నిర్మాణాత్మక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పిల్‌లో తెలిపారు. ఈ కట్టడాలు తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి ప్రతీకలని.. భవిష్యత్ తరాల కోసం వాటిని పరిరక్షించాలన్నారు.
పురావస్తు విభాగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు
ఇక.. హెరిటేజ్ రక్షణ, పర్యావరణ, పురావస్తు విభాగాల నిపుణులతో కూడిన ఒక కమిటీతో.. సమగ్ర అధ్యయనం చేయించాలని కోరారు. రాష్ట్ర, కేంద్ర పురావస్తు శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నాకే.. పనులు కొనసాగించాలని.. అప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా.. ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పనలో సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ ప్రభావ అంచనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అప్పటివరకు మెట్రో రెండవ దశ పనులను నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
పాతబస్తీ మెట్రో పనులపై తీవ్ర ప్రభావం
హైకోర్టు ఆదేశాలు.. పాతబస్తీ మెట్రో పనులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో.. మెట్రో లాంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టినప్పుడు.. దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అయితే.. వారసత్వ కట్టడాల పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత. అయితే.. ఈ పరిణామం ఇప్పుడు.. పాతబస్తీకి మెట్రో అందుబాటులోకి తీసుకురావాలన్న సర్కార్ సంకల్పాన్ని బలహీనపరిచేదిగా కనిపిస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక.. లక్షలాది మందికి ప్రశాంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు అనుమతి
సిటీలో దూర ప్రాంతాలను.. తక్కువ సమయంలో కవర్ చేయాలంటే.. మెట్రోనే బెటరనే టాక్ ఉంది. అందువల్ల.. పాతబస్తీకి కూడా మెట్రో కావాలనే డిమాండ్ అక్కడి ప్రజల నుంచి వచ్చింది. నిజానికి.. ఇప్పటికే గ్రీన్‌లైన్‌లో ఫలక్‌నుమా వరకు మెట్రో అందుబాటులోకి రావాల్సింది. కానీ.. ఆస్తుల సేకరణలో ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎల్ అండ్ టీ ఎంజీబీఎస్ వరకే మెట్రో లైన్ నిర్మిచింది. పాతబస్తీ ప్రజలు కోరడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆస్తులు సేకరించింది. కానీ.. ఇప్పుడు మళ్లీ వారసత్వ కట్టడాలకు ప్రమాదం పొంచి ఉందని.. హైకోర్టులో పిల్ దాఖలు కావడం.. న్యాయస్థానం తాత్కాలికంగా ఇటీవల పనులు ఆపేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ ప్రాజెక్టుకు.. ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.