సాయంత్రం స్నాక్స్ గా పిల్లలకు ఏం పెట్టాలా? అని ఆలోచిస్తున్నారా. ఇక్కడ మేము నెల్లూరు పునుగులు రెసిపీ ఇచ్చాము. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో ఉన్న బియ్యంతోనే వీటిని తయారు చేసుకోవచ్చు. చట్నీ లేకపోయినా కూడా వీటిని తినేయొచ్చు. ఇక కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. ఈ నెల్లూరు పునుగులు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
నెల్లూరు పునుగులు రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం – నాలుగు కప్పులు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
శెనగపప్పు – మూడు స్పూన్లు
మినప్పప్పు – రెండు కప్పులు
వంటసోడా – చిటికెడు
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం – చిన్న ముక్క
ఉల్లిపాయలు – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – ఒక స్పూను
నెల్లూరు పునుగులు రెసిపీ
1. నెల్లూరు పునుగులు చేసేందుకు ముందుగా బియ్యాన్ని, మినప్పప్పును, శనగపప్పును విడివిడిగా నానబెట్టుకోవాలి.
2. మూడు నుంచి నాలుగు గంటలు నానబెడితేనే ఇవి మెత్తగా అవుతాయి.
3. ఆ తర్వాత మిక్సీలో బియ్యాన్ని, మినప్పప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఆ పిండిని ఒక గిన్నెలో వేసి రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకోవడం మర్చిపోవద్దు.
5. ఇప్పుడు అల్లాన్ని సన్నగా తరగాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
6. పిండిలో ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి.
7. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
8. ఆ నూనెలో ఈ పిండితో గుండ్రని పునుగుల్లాగా వేసుకోవాలి.
9. అన్ని వైపులా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ నెల్లూరు పునుగులు రెడీ అయినట్టే.
ఈ నెల్లూరు పునుగులను టమాటో కెచప్ తో తిన్నా రుచిగా ఉంటాయి. లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచి రెట్టింపు అవుతుంది. ఒకసారి వీటిని చేసుకున్నారంటే జీవితంలో మర్చిపోలేరు. నెల్లూరులో ఒకప్పుడు వీటిని అధికంగా చేసేవారు. ఇవి నెల్లూరులోనే పుట్టాయని కూడా చెప్పుకుంటారు. అందుకే వీటికి నెల్లూరు పునుకులు అని పేరు పెట్టారు.