Hyderabad Bullet Train Update: హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం మూడు గంటల్లో చేరుకునేలా ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్-పూణే-ముంబై హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(DPR) పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని రైల్వే శాఖ ప్రతినిధులు వివరించారు.
ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే ప్రస్తుతం 12 నుంచి 15 గంటలు పడుతున్న హైదరాబాద్-ముంబై ప్రయాణం కేవలం 3 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. గంటకు సుమారు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. సర్వీస్ రకం, స్టేషన్ల దగ్గర ఆగే సమయాన్ని బట్టి ప్రయాణ సమయం 2 గంటల 55 నిమిషాల నుంచి 3 గంటల 13 నిమిషాల మధ్య ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం పొడవు సుమారు 671 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణలో 93 కి.మీ, కర్ణాటకలో 121 కి.మీ, మహారాష్ట్రలో 457 కి.మీ. మేర ట్రాక్ నిర్మాణం ఉండనుంది. దేశ వ్యాప్తంగా హైస్పీడ్ రైలు నెట్ వర్క్ ను విస్తరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను చేపడుతోంది. హైదరాబాద్-ముంబై మార్గానికి DPR సిద్ధం కాగా, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్లకు సంబంధించిన సర్వేలు ఇంకా కొనసాగుతున్నాయి.
ప్రతిపాదిత బుల్లెట్ రైలు మార్గంలో కీలక నగరాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో కోకాపేట్, వికారాబాద్ ప్రాంతాల్లో స్టేషన్లు ఉండనున్నాయి. కర్ణాటకలో కలబురగి దగ్గర స్టేషన్ ప్రతిపాదించారు. మహారాష్ట్రలో సోలాపూర్, పండర్‌పూర్, బారామతి, పూణే, పింప్రి-చించ్వాడ్, లోనావాలా, నవీ ముంబై, థానే, విక్రోలి ప్రాంతాల్లో స్టేషన్లు ఉండనున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలోని శంషాబాద్ దగ్గర డిపో, మెయింటెనెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో పెద్ద మొత్తంలో రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే ప్రణాళిక ఉంది.
ఈ ప్రాజెక్ట్ లో ఇంజినీరింగ్ పరంగా అత్యంత కష్టమైన పనులు ఉండనున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొండ ప్రాంతాల్లో సొరంగ మార్గాలు నిర్మించాల్సి ఉంటుంది. మొత్తం 35.3 కిలోమీటర్ల భూగర్భ మార్గం ప్రతిపాదించారు. ఖండాలా ఘాట్ ప్రాంతంలో 13 చోట్ల దాదాపు 24 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించనున్నారు. ఇక ట్రాక్‌లో ఎక్కువ భాగం మెట్రో రైళ్ల తరహాలో ఎలివేటెడ్ కారిడార్ రూపంలో ఉండనుంది. ఈ మార్గంలో 101 వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. అందులో 13 స్టీల్ బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. మూలా-ముఠా, భీమా, బోరి నదులపై ప్రత్యేక వంతెనలు నిర్మించనున్నారు.
ప్రాజెక్ట్ కోసం తెలంగాణలో సుమారు 93 కి.మీ. మేర భూసేకరణ అవసరమని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. స్టేషన్లు, పార్కింగ్, టెర్మినల్స్, డిపో వంటి సదుపాయాల కోసం అదనపు భూమి కూడా అవసరం అవుతుంది. ప్రతి స్టేషన్ కాంప్లెక్స్ కోసం సుమారు 247 ఎకరాల భూమి అవసరం కావచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ కారిడార్‌లో నడిచే ప్రతి బుల్లెట్ రైలులో 16 కోచ్‌లు ఉండనున్నాయి. ఒక్కో రైలులో సుమారు 1,215 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది.
Read Also: ఫస్ట్ ఇండియన్ బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ రిలీజ్.. చూడ్డానికి భలే ఉంది భయ్యా!