ధర్మబద్ధమైన జీవితానికి విలువలతో కూడిన జీవితానికి శ్రీరాముడే ఉదాహరణ. మానవ జీవితాన్ని ఉత్తమంగా ఎలా జీవించాలో ప్రత్యక్షంగా చూపించారు ఆయన. ధర్మం, క్షమ, మంచి, విధేయత అన్నింటిన అతని జీవితం నుంచి నేర్చుకోవచ్చు. రామాయణం కేవలం ఒక పుస్తకమో, పురాణమో కాదు.. మనిషికి మార్గదర్శి అని చెప్పుకుంటారు. రాముడిని అత్యంత దైవిక శక్తిగా చూసే భారతీయులు ఎంతోమంది.
నిత్యం రామనామ పారాయణంతో పరవశించిపోతారు. అలాంటి భక్తులు రాముడు అడుగుపెట్టిన ప్రదేశాలను ఒక్కసారైనా జీవితంలో చూడాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసమే ఐఆర్సిటిసి శ్రీ రామాయణ యాత్ర ప్రవేశ పెట్టింది. దీని ఐదవ ఎడిషన్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ జూలై 25న ఢిల్లీ నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది. 17 రోజుల పాటు ప్రణాళిక బద్దంగా ఈ ప్రయాణం సాగుతుంది. రామాయణంతో అనుబంధం ఉన్న దాదాపు 30 కంటే ఎక్కువ ప్రదేశాలను ఈ ప్యాకేజీలో భాగంగా చూడవచ్చు.
ఎన్ని ప్రదేశాలు
17 రోజుల పాటు ఈ రామాయణ యాత్ర సాగుతుంది. ఇందులో భాగంగా అయోధ్య సీతామర్హి, జనక్ పూర్, వారణాసి, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం ఇలా రాముడితో అనుబంధం ఉన్న 30 కంటే ఎక్కువ. ప్రదేశాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది. చివరకు ఢిల్లీలో తిరిగి యాత్ర ముగుస్తుంది.
ఈ టూరిస్ట్ రైలు పూర్తిగా ఏసీతో నిండి ఉంటుంది. ఒకటో, రెండో, మూడో ఏసీ కోచ్‌లు ఇందులో ఉంటాయి. ప్రయాణికుల కోసం రెస్టారెంట్లు, వంటగది, సెన్సా ర్లు, వాష్ రూములు, ఫుట్ మసాజులు, సీసీటీవీ, గార్డులు ఇలా ఆధునిక సౌకర్యాలు అన్ని ఈ ట్రైన్ లో ఉంటాయి.
ఖర్చు ఎంత?
ఈ రైలులో మీరు ఎంచుకున్న తరగతులు బట్టి ఖర్చు ఆధారపడి ఉంటుంది. మీరు థర్డ్ ఏసి ఎంపిక చేసుకుంటే ఒక్కొక్కరికి 1,17,975 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ ఏసీ బుక్ చేసుకొని ఉంటే ఒక్కొక్కరికి 1,40,120 రూపాయలు చెల్లించాలి. ఇక ఫస్ట్ ఏసీ క్యాబిన్ బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి 1,66,380 రూపాయలు చెల్లించాలి. ఇక ఫస్ట్ ఏసీ కూపే బుక్ చేసుకుంటే ఒక వ్యక్తికి 1,79,515 రూపాయలు చెల్లించాలి.
ఈ ప్యాకేజీ లోనే ఏసీ రైలు ప్రయాణంతో పాటు హోటల్లో బస చేయడం, వెజ్ భోజనాలు, ప్రయాణం బీమా ఇతర సేవలు అన్ని లభిస్తాయి.
ఎక్కడి నుంచి బయలుదేరుతుంది?
ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఈ రామాయణ యాత్ర చేయాలనుకుంటే మొదట ఢిల్లీలోని సఫ్టార్ జంగ్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాల్సిందే. అక్కడ నుంచి అయోధ్యకు ప్రయాణమవుతారు. శ్రీరామ జన్మభూమిగా చెప్పుకునే ఈ ప్రదేశాన్ని అక్కడున్న ఆలయాన్ని దర్శించుకుంటారు. అలాగే అయోధ్యలో ఉన్న పురాతన భక్తి రామాయణ ప్రదేశాలను కూడా దర్శించుకుంటారు.
ట్రైన్ దిగాక మీకు ప్రత్యేకమైన వ్యాన్లు, బస్సులు వంటివి ఏర్పాటు చేస్తారు. ఇక అయోధ్య నుంచి నందిగ్రామ్ లోని భరత్ కుండ్ అనే ప్రదేశానికి వెళతారు. రాముడు వనవాస సమయంలో అతని సోదరుడైన భరతుడు ఇక్కడే తపస్సు చేశాడని నమ్ముతారు. దీని తర్వాత బీహార్‌లోని సీతామర్హి అనే ప్రదేశానికి వెళతారు. ఇక్కడ ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీతా జన్మస్థలంగా చెప్పుకునే నేపాల్ లోని జనక్ పూర్ ప్రదేశానికి వెళ్తారు. దీనినే జానకి మందిర్ అని కూడా పిలుస్తారు. అక్కడి నుంచి తిరిగి బీహార్, వారణాసి, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వరకు ప్రయాణం చేస్తారు. తమిళనాడు నుంచి తిరిగి ట్రైన్ ఢిల్లీ వెళ్ళిపోతుంది. తమిళనాడుకు భక్తులు కావాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలో దిగిపోవచ్చు. అది వారి ఇష్టం పై ఆధారపడి ఉంటుంది.