AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెడీ అవుతోంది. కాసేపట్లో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. విచారణ తర్వాత ఆయన్ని అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ కేసు క్లయిమాక్స్‌కి చేరింది. ఈ కేసులో రేపోమాపో అరెస్టు చేసేందుకు రెడీ అవుతోంది సిట్. ఈ వ్యవహారంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. మూడురోజుల కిందట ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అక్కడ ఆయనకు ఉపశమనం లభించలేదు.
దీంతో మిథున్‌రెడ్డి అరెస్టు దాదాపుగా ఖాయమైంది. శుక్రవారం మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో జస్టిస్ పార్థివాలా- జస్టిస్ మహదేవన్ ధర్మాసనం ముందుకొచ్చింది. ఈ సందర్భంగా వాదోపవాదనలు జరిగాయి. మిథున్‌రెడ్డి తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ తన వాదనలు వినిపించారు.
తనకు ప్రమేయం లేకపోయినా ఒకసారి విచారణకు పిలిచారని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించానని, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించినప్పటికీ అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ఈ క్రమంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. చెప్పడానికి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించింది.
ALSO READ: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి బకాయిలు కోట్లలో.. నోటీసులు జారీ
సింఘ్వీ సమాధానాలతో సంతృప్తి చెందలేదు ధర్మాసనం. ఈ కేసులో ఎలాంటి సంబంధం లేకపోయినా రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపిస్తూ కేసు విచారణ సమయంలో మూడుసార్లు సుప్రీంకోర్టుకి వచ్చారని గుర్తు చేశారు.
అరెస్టు చేయకుండా ఛార్జిషీటు ఎలా దాఖలు చేశారని ప్రస్తావించింది. సరెండర్ కావడానికి పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని, కొంత సమయం ఇవ్వాలని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ సమయం ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వెంటనే మిథున్‌రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్టు చేసే అవకాశమున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. న్యాయస్థానం తీర్పుతో వైసీపీ కీలక నేతల్లో అసలు టెన్షన్ మొదలైంది. విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే ఆయనపై సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత మిథున్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం రెండోసారి. మార్చిలో ఒకసారి హైకోర్టుకు వెళ్లారు. అప్పటికి ఆయన్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. దీంతో కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు ఆయన బయటకొచ్చారు. ఇప్పుడు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.