Railway Minister Ashwini Vaishnaw About Vande Bharat Sleeper Trains: భారతీయ రైల్వే సంస్థ త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లలను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇప్పటి వరకు చైర్ కార్ లు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో రాత్రిపూట ప్రయాణానికి అనుకూలంగా ఉండే వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన ట్రయల్ రన్ త్వరలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
ఆ ప్రచారం అంతా అవాస్తవం- అశ్విని వైష్ణవ్
మరోవైపు డిజైన్లలో జాప్యం కారణంగా ఇప్పట్లో వందేభారత్ స్లీపర్ ప్రారంభం అయ్యే అవకాశం లేదని ప్రచారం జరిగింది. డిజైన్ క్లియరెన్స్ సమస్యల కారణంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ ప్రక్రియను ప్రారంభించడంలో జాప్యం జరుగుతోందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. స్లీపర్ రైలు ఆలస్యం అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. వందేభారత్ స్లీపర్ రైళ్ల నిర్మాణానికి సంబంధించి రష్యన్ కంపెనీ ట్రాన్స్ మాష్ హోల్డింగ్ (TMH)తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అయితే.. ఈ కోచ్ లలో టాయిలెట్లు, ప్యాంట్రీ కార్ ఉండాలని అధికారులు సూచించడంతో కోచ్ ల డిజైన్ మరింత ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం కాదని ఆయన వెల్లడించారు.
16, 202, 24 కోచ్ లతో కూడిన రైళ్లు
అటు వందేభారత్ రైలు సెట్లు తయారు చేయడం రష్యన్ కంపెనీకి అసలు సమస్యే కాదన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. అయితే, రష్యాలో తక్కువ జనాభా కారణంగా అక్కడి రైళ్లకు తక్కువ సంఖ్యలో కోచ్ లు ఉన్నాయని, భారత్ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. “రష్యన్ కంపెనీకి ఇప్పటి వరకు 6, 8 కోచ్ లను తయారు చేసిన అనుభవం ఉంది. వందేభారత్ డిజైన్ ను మేమే అందిస్తామని చెప్పాం. “కాంట్రాక్టు చేసుకునే సమయంలో 16, 20, 24 కోచ్ లతో కూడిన రైలు సెట్లను తయారు చేయాలని స్పష్టంగా చెప్పాం. భారత్ లో ఎక్కువ జనాభా ఉందని, అందుకు అనుగుణంగా కొన్ని రూట్లలో 24 కోచ్‌లు అవసరం కాగా, ఇతర మార్గాల్లో 16 కోచ్‌లు అవసరం ఉంటాయని చెప్పాం. రష్యాలో తక్కువ జనాభా ఉన్నందున రైళ్లలో సాధారణంగా 6 నుంచి 8 కోచ్‌లు ఉంటాయి. ఒప్పందం ప్రకారం రష్యన్ కంపెనీ 1,920 స్లీపర్ కోచ్‌లను తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే అన్ని అనుమతులు పూర్తయ్యాయి. త్వరలోనే కోచ్ తయారీ పనులు మొదలవుతాయి” అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
చెన్నై ఐసీఎఫ్ లో బోగీల తయారీ
ఇక వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన బోగీలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన ఓ బోగీని అధికారులు మీడియాకు చూపించారు. గంటలకు గరిష్టంగా 160 కి. మీ వేగంగా వెళ్లేలా దీన్ని రూపొందించినట్లు తెలిపారు. అంతేకాదు.. వందేభారత్ స్లీపర్ రైలు ఏక బిగిన 1,200 కిలో మీటర్ల దూరం ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ రైళ్లకు సంబంధించిన ట్రయల్ రన్ లక్నోలో రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, పశ్చిమ, మధ్య రైల్వే ఆధ్వర్యంలో జరగనుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ రైలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది.
Read Also: దూసుకెళ్తున్న హైదరాబాద్ మెట్రో.. ఆ కారిడార్‌లో రోజుకు ఏకంగా అంతమంది ప్రయాణిస్తున్నారట!