Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ప్రయాణీకుల తరలింపులో సరికొత్త రికార్డు సాధించింది. తొలి రోజుల్లో సుమారు 2 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చిన హైదరాబాద్ మెట్రో, ఇప్పుడు ఐదున్నర లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నది. హైదరాబాద్ ప్రజలకు మెరుగైన రవాణా అందిస్తున్నది.
7 ఏండ్లలో 63 కోట్ల మంది ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైల్లో ఇప్పటి వరకు 63.5 కోట్ల మంది ప్రయాణించారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అమీర్ పేట మెట్రో స్టేషన్ లో జరిగిన ఏడో వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి చేరిందన్నారు. “ఏడేళ్ల క్రితం, హైదరాబాద్ లో మెట్రో ప్రయాణాన్ని ప్రారంభించాం. ఏడుళ్లుగా మెట్రో ఆపరేషన్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాం. మున్ముందు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుంటాం” అని తెలిపారు. దేశంలోని అన్ని మెట్రోల కంటే వేగంగా హైదరాబాద్ మెట్రోలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రోజూ సగటున 4.67 లక్షల మంది ప్రయాణిస్తుండగా, రద్దీ సమయాల్లో 5.6 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే 3 ఏండ్లలో 80 కోట్ల మంది ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు అందిస్తున్నాయి. 3 నుంచి 6 నిమిషాలకు ఓసారి రైలు అందుబాటులో ఉంటుంది. కారిడార్ 1లోని ఎల్బీనగర్లో రోజుకు సగటును 50 వేల మంది, కారిడార్ 3లోని రాయదుర్గంలో 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. కారిడార్ 2లో 25 వేల వరకు ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాల్లో ప్రయాణికుల సంఖ్య 80 కోట్లకు చేరుతుందన్నారు.
కేంద్రం నుంచి అనుమతుల రాగానే రెండో దశ పనులు
అటు రెండోదశ మెట్రో పనుల విస్తరణకు ఎలాంటి నిధుల కొరత లేదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన తర్వాత రెండో దశ పనులు మొదలవుతాయన్నారు. రెండోదశలో 5 కారిడార్లలో ఒకేసారి పనులు మొదలవుతాయన్నారు. రెండో దశలో 116.4 కిలోమీటర్ల మెట్రోను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం, ప్రజలు సహకరించారని చెప్పారు. రెండో దశ మెట్రో ప్రాజెక్టులో కిలో మీటరుకు రూ. 318 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అండర్ గ్రౌండ్ కోసం కిలో మీటరుకు రూ.600 నుంచి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
రూ. 14, 132 కోట్లతో హైదరాబాద్ మెట్రో నిర్మాణం
ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్ పద్దతిలో నిర్మించారు. దీని కోసం సుమారు రూ.14,132 వేల కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 2017 నవంబర్ లో హైదరాబాద్ మెట్రో ప్రారంభం అయ్యింది. ఎల్‌బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోలు-రాయదుర్గం కారిడార్ల పరిధిలోని 69.2 కిలోమీటర్ల మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి.
Read Also: నెరవేరిన అర్థ శతాబ్దం కల, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్