Indian Railways AC Facility: రైల్వే శాఖ ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను పెంచడంతో పాటు రైళ్లలోనూ మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. రైల్వే ఇప్పుడు నాన్-AC కోచ్ లకు కూడా AC కోచ్ ల సౌకర్యాలను కల్పించబోతోంది. ఈ మేరకు కీలక విషయాలను వెల్లడించింది. రైల్వేకు సంబంధించిన ఈ కొత్త సౌకర్యం హ్యాండ్ వాష్ కు సంబంధించినది. సుదూర రైళ్లలో స్లీపర్ కోచ్‌లలో కూడా లిక్విడ్ సోప్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ సౌకర్యం AC కోచ్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ తో పాటు అన్ని నాన్-AC స్లీపర్ రిజర్వుడ్ కోచ్ లలో హ్యాండ్ వాషింగ్ సౌకర్యం కల్పించాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది.
ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్న రైల్వే బోర్డు
భారతీయ రైల్వేలో పరిశుభ్రత ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగానే కొత్త సౌకర్యాలను కల్పించాలని భావిస్తోంది. ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ సౌకర్యం ఉన్న రైళ్లలోని.. అన్ని నాన్-AC స్లీపర్ రిజర్వ్ కోచ్‌లకు AC రిజర్వ్ కోచ్‌ల మాదిరిగానే లిక్విడ్ హ్యాండ్ వాష్ ను అందించాలనే నిర్ణయాన్ని బోర్డు ఇప్పటికే ఆమోదించింది. OBHS సౌకర్యం ఉన్న రైళ్లలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు సూచించినట్లు రైల్వే బోర్డు తెలిపింది.
రైల్వే అధికారులు ఏం చెప్పారంటే?
రైల్వే బోర్డు తర్వాత సుదూర మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల స్లీపర్ కోచ్ లలో ఇప్పుడు లిక్విడ్ హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచబడుతుంది. OBHS సౌకర్యం ఉన్న రైళ్లలోని టాయిలెట్లు, స్లీపర్ కోచ్ ల కారిడార్లలోని వాష్ బేసిన్ ల దగ్గర లిక్విడ్ సోప్ డిస్పెన్సర్ లను ఏర్పాటు చేస్తామని రైల్వే మెకానికల్ అధికారులు తెలిపారు. రైలు ప్రారంభమయ్యే ముందు వాటిలో లిక్విడ్ హ్యాండ్ వాష్ నింపబడుతుందన్నారు. ప్రయాణ సమయంలో అయిపోతే, రైల్వే సిబ్బంది మళ్లీ ఫిల్ చేస్తారని తెలిపారు.
ఎంపిక చేసిన రైళ్లలో OBHS సౌకర్యం
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పలు రైళ్లు నడుస్తున్నాయి. రాజధాని ఎక్స్ ప్రెస్, శతాబ్ది ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్ ప్రెస్, తేజస్ ఎక్స్ ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లు ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణీకులకు అనేక రకాల సౌకర్యాలు అందిస్తున్నారు. కొన్ని సూపర్ ఫాస్ట్, మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కొన్ని ప్యాసింజర్ రైళ్లు కూడా సేవలను అందిస్తున్నాయి. సూపర్ ఫాస్ట్ మెయిల్-ఎక్స్ ప్రెస్ రైళ్లలోని ఎంపిక చేయబడిన రైళ్లలో OBHS సౌకర్యం ఉంది. రైల్వేశాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక స్లీపర్ కోచ్ ప్రయాణీకులు కూడా మెరుగైన శుభ్రతను పొందే అవకాశం ఉంది.
Read Also: రైలు కిందకు దూసుకెళ్లిన టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. తప్పు నాది కాదు, కారుదే అంటోన్న డ్రైవర్!