Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇప్పుడు కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బాక్స్ లభ్యమైనా.. దాన్ని విశ్లేషించే ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బ్లాక్ బాక్స్‌లోని డేటాని పూర్తిగా అనలైజ్ చేశాకే.. విమానం ఎందుకు కూలిపోయిందనేది తెలుస్తుంది. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అయితే.. విమానం కూలిపోవడానికి మూడు కారణాలు ఉండొచ్చని ప్రముఖ ఏవియేషన్ నిపుణుడు కెప్టెన్ స్టీవ్ చెబుతున్నారు. దీనికి ఆయన కొన్ని ఆధారాలు కూడా చూపుతున్నారు.
ఆ వీడియోలో కీలక సాక్ష్యం!
విమానం కూలుతున్నప్పుడు తీసిన వీడియో ఆధారంగా.. విమానంలోని రామ్ ఎయిర్ టర్బైన్ యాక్టివేట్ అయినట్లు తెలుస్తోందని కెప్టెన్ స్టీవ్ అంటున్నారు. విమానాల్లో దీన్ని అత్యవసర పరిస్థితుల్లో.. ప్రధాన విద్యుత్ లేదా హైడ్రాలిక్ సిస్టమ్ లేదా రెండు ఇంజన్లు విఫలమైనప్పుడు ఉపయోగిస్తారు. ఇది విమాన వేగం ద్వారా గాలిని ఉపయోగించి టర్బైన్‌ను తిప్పి.. అవసరమైన విద్యుత్ లేదా హైడ్రాలిక్ శక్తిని ఉత్పత్తి చేసే బ్యాకప్ సిస్టమ్. విమానం టేకాఫ్ అయ్యాక, కిందికి వెళ్తున్న సమయంలో రామ్ ఎయిర్ టర్బైన్ యాక్టివేట్ అయిందని.. అందువల్లే విమానం నుంచి పెద్ద శబ్దాలు వచ్చాయని.. ఆ వీడియో ఆధారంగా కెప్టెన్ స్టీవ్ చెబుతున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికుడు కూడా, విమానం కూలే ముందు పెద్ద శబ్దాలు వచ్చాయని, క్యాబిన్ లైట్లు మిణుకు మిణుకుమన్నాయని చెప్పాడని… రామ్ ఎయిర్ టర్బైన్ యాక్టివేట్ అయిందనడానికి ఇదే నిదర్శనమని స్టీవ్ చెబుతున్నారు. ఇది యాక్టివేట్ అయినప్పుడు, విద్యుత్ సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం కలిగి, శబ్దం వస్తుందని ఆయన చెప్పారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో తీసిన వీడియోలో.. విమానం కింది భాగంలో కనిపించిన చుక్క లాంటిది రామ్ ఎయిర్ టర్బైనే అనేది స్టీవ్ వాదన.
చాలా అరుదైన వైఫల్యం!
ఇక.. విమానంలోని రెండు ఇంజన్లు కూడా ఒకేసారి విఫలమై ఉండొచ్చనేది స్టీవ్ విశ్లేషణ. విమానం టేకాఫ్ సమయంలో కేవలం 672 అడుగుల ఎత్తుకు చేరుకుని, ఆ తర్వాత వేగంగా కిందికి వచ్చిందని.. రెండు ఇంజన్లు విఫలమైతేనే ఇలా జరుగుతుందని ఆయన అంటున్నారు. ఆధునిక బోయింగ్ 787 విమానంలో రెండు ఇంజన్లు ఒకేసారి విఫలం కావడం అనేది చాలా అరుదు అని.. దీనికి కారణాలేంటో తెలుసుకోవడానికి పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని స్టీవ్ చెప్పారు.
వింగ్ ఫ్లాప్ ప్రాబ్లమ్!
విమానం కూలిపోవడానికి వింగ్ ఫ్లాప్ సమస్య కూడా ఒక కారణం కావొచ్చని స్టీవ్ భావిస్తున్నారు. టేకాఫ్ టైమ్‌లో ఫ్లాప్‌లను సరిగ్గా సెట్ చేయకపోయినా, లేదా రిట్రాక్ట్ చేసినా ఈ సమస్య తలెత్తుతుందని ఆయన చెబుతున్నారు. ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ చేయాలని కో-పైలట్‌ను ప్రధాన పైలట్ ఆదేశించినప్పుడు.. కో-పైలట్ పొరపాటున ఫ్లాప్ హ్యాండిల్‌ను రిట్రాక్ట్ చేసి ఉన్నా.. విమానం లిఫ్ట్ కోల్పోయి, డ్రాగ్ పెరిగి క్రాష్‌కు దారి తీసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
పక్షుల ఢీ వల్ల కాదా?
మరోవైపు, పక్షులు ఢీకొనడం లేదా ఇంధనం కలుషితం కావడం వల్ల విమానం కూలిపోయి ఉండొచ్చనే వాదనను కెప్టెన్ స్టీవ్ తోసిపుచ్చారు. వీడియో ఫుటేజ్‌లో పక్షుల ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఒకవేళ ఇంధనం కలుషితమై ఉంటే, విమానంలోని అత్యాధునిక వ్యవస్థలు దాన్ని గుర్తించి ఉండేవని.. కాబట్టి ఇంధనం కలుషితం కావడం వల్ల విమానం కూలి ఉండొచ్చన్న వాదన కూడా సరికాదని స్టీవ్ అన్నారు.