Indian Railways: తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి శ్రీవారి భక్తులు నిత్యం తిరుపతికి వెళ్తుంటారు. చాలా మంది తిరుపతికి వెళ్లేందుకు హైదరాబాద్ కు రావాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. చిన్న నగరాల నుంచి కూడా తిరుపతికి నేరుగా రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నది. అందుబాటులో భాగంగానే తాజాగా కరీంనగర్ నుంచి తిరుపతికి రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ రైలు ప్రతి రోజూ అందుబాటులో ఉండబోతోంది.
ఇప్పటి వరకు వారానికి రెండుసార్లు
నిజానికి గత కొద్ది సంవత్సాలుగా కరీంనగర్ నుంచి తిరుపతికి రైళ్లు నడుస్తున్నాయి. వారానికి రెండు సార్లు(ఆదివారం, గురువారం) ఈ రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. గత కొద్ది రోజులుగా కరీంనగర్ పునర్నిర్మాణ పనులు జరగడంతో ఈ రైలును నిలిపివేశారు. రైల్వే స్టేషన్ నిర్మాణం తర్వాత మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. గతంలో వారానికి రెండుసార్లు నడిచిన కరీంనగర్-తిరుపతి రైలు ఇకపై రోజూ నడిపించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. ఈ రైలు రోజూ నడిస్తే ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు.
ఇకపై ప్రతి రోజూ రైళ్లు నడిపేలా ఉత్తర్వులు
మంత్రి పొన్నం ప్రభాకరం పలుమార్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ నుంచి తిరుపతికి రెగ్యులర్ సర్వీసులు నడపనున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రత్యేక రైలు జూలై 6 నుంచి జూలై మధ్య అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుకోనుంది. అటు సోమవారం సాయంత్రం 5:30కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8:25కి తిరుపతి చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైలు ప్రయాణీకుల రద్దీని బట్టి రెగ్యులర్‌గా నడిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు కేటాయించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు చెప్పారు.
అటు కరీనంనగర్- తిరుపతి రైలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఉత్తర తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఈ రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. మెరుగైన కనెక్టివిటీ, సులభ ప్రయాణ అనుభవాన్ని అందించడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రేరేపిస్తుందన్నారు. ఈ రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు శ్రీవారి భక్తులు ధన్యవాదాలు చెప్తున్నారు.
Read Also: 78 ఏళ్లకు తొలిసారి రైలు కూత, రైల్వే లైన్ లేని రాష్ట్రం ఇక లేనట్టే!