Aizwal Rail Link: ఇంతకాలం దేశంలో రైల్వే లైన్ లేని రాష్ట్రం ఏది అనగానే మిజోరాం అని ఠక్కున చెప్పేవారు. కానీ, ఇకపై ఆ మాట మర్చిపోవాల్సిందే. ఎందుకంటే, ఇప్పుడు మిజోరంలోనూ రైలు కూతలు వినిపించబోతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్ల తర్వాత మిజోరాం రాజధానికి రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈశాన్య సరిహద్దు రైల్వే(NFR) సైరాంగ్‌కు మొట్టమొదటి ట్రయల్ రన్‌ను నిర్వహించింది. మిజోరాం రాజధాని ఇప్పుడు బైరాబి-సైరాంగ్ లైన్ ద్వారా ఇండియన్ రైల్వే నెట్ వర్క్ తో కనెక్ట్ అవుతోంది.
తొలి ట్రయల్ రన్ సక్సెస్
భారతీయ రైల్వేలో మరో మైల్ స్టోన్. మిజోరం రాజధాని ఐజ్వాల్ లోని సైరాంగ్‌కు మొట్టమొదటి ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. జాతీయ రైల్వే నెట్ వర్క్ తో మొదటిసారిగా అనుసంధానించింది. రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ చౌదరి, ఇతర సీనియర్ రైల్వే అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే, మారుమూల పర్వతప్రాంత రాష్ట్రంలో మెరుగైన లాజిస్టిక్స్, పర్యాటకం, ఆర్థిక అభివృద్ధికి బీజం పడనుంది.
జూన్ 17 తర్వాత ప్రారంభం
ఐజ్వాల్ రైల్వే లైన్ జూన్ ప్రారంభంలో రైల్వే భద్రతా కమిషనర్ తనిఖీ చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 17 తర్వాత అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. 51.38 కి.మీ. పరిధిలో ఉన్న భైరాబి-సైరాంగ్ రైలు మార్గం ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇందులో 48 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలు, 87 చిన్న వంతెనలు ఉన్నాయి. సొరంగం మొత్తం పొడవు 12,853 మీటర్లు. వంతెనల సంఖ్య 196. కొన్ని చోట్ల ఈ రైల్వే లైన్ 104 మీటర్ల ఎత్తు నుంచి వెళ్తుంది. కుతుబ్ మినార్ కంటే 42 మీటర్లు ఎక్కువ.
Read Also: ఈ పాములు కరిస్తే.. మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? బతికితే వింతే!
నాలుగు విభాగాలుగా రైల్వే లైన్
ఐజ్వాల్ రైల్వే లైన్ ను నాలుగు విభాగాలుగా విభజించారు. వాటిలో ఒకటి భైరాబి-హోర్టోకి, రెండు హోర్టోకి-కాన్పుయి, మూడు కౌన్పుయి-మువల్ఖాంగ్, నాలుగు మువల్ఖాంగ్-సైరాంగ్. ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రకారం, ఈ ప్రాజెక్ట్ మిజోరాం రాజధానికి చేరుకునే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. సరుకుల రవాణాకు ఎంతగానో ఉపయోగపడనుంది. రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. ఇది చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధికి దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రయాణ కనెక్టివిటీని బలోపేతం చేయనుంది. ఈ వ్యూహాత్మక లింక్ ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గిస్తుంది. వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచుతుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద ఆగ్నేయాసియాతో సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ రైల్వే లైన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ రైల్వే లైన్ తో దేశంలోని అన్ని రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ లభించినట్లు అయ్యింది. దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రైల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
Read Also: విమానంలో ఇంధన ట్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఎమర్జెన్సీ టైమ్ లో ఏం చేస్తారు?