Indian Railways: జమ్మూకాశ్మీర్ కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు భారతీయ రైల్వే సంస్థ కీలక చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే ఉధంపూర్-శ్రీనగర్- బారాముల్లా నడుమ రైల్వే లింక్ ను నిర్మిస్తున్నది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభంకాబోతున్నది. మరోవైపు కాశ్మీర్ లోయలో తొలి వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
కత్రా- శ్రీనగర్ నడుమ వందేభారత్ రైలు
శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా-శ్రీనగర్- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నడుమ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇది కాశ్మీర్ లోయకు మొదటి సెమీ హై స్పీడ్ రైలు కాగా జమ్మూకి మూడవది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్ లో రెండు అల్ట్రా మోడ్రన్ రైళ్లను ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నడుమ నడుస్తుండగా, మరో రైలు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా- న్యూ ఢిల్లీ నడుమ సేవలను అందిస్తున్నది. కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కాశ్మీర్ లోయ అభివృద్ధికి మరింత దోహదపడనుంది. ఆ ప్రాంత ఆర్థిక వృద్ధికి తోడ్పడనుంది.
త్వరలో ప్రారంభంకానున్న వందేభారత్ రైలు కత్రా-శ్రీనగర్ నడుమ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. 2:30 గంటల లోపు 100 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని చేరుకుంటుంది. కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి 08:10 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభిచనుంది. 11:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో,ఈ రైలు శ్రీనగర్ నుంచి 12:45 గంటలకు బయలుదేరి 3:55 గంటలకు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాకు చేరుకుంటుంది. ఈ రైలు USBRL ప్రాజెక్ట్ లోభాగంగా తన సేవలను అందించనుంది.
వారానికి 6 రోజులు అందుబాటులో..
కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ రైలు 16 లేదంటే 20 కోచ్‌లతో కూడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రైలులో రెండు రకాల వసతి ఉంటుంది. వాటిలో ఒకటి AC చైర్ కార్ కాగా, మరొకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది. అటు ఈ రైలుకు సంబంధించిన టికెట్ ఛార్జీలు కూడా ఇంకా ఖరాలు కాలేదు. శ్రీమాతా వైష్ణో దేవి కత్రా నుంచి శ్రీనగర్ కు ప్రయాణానికి AC చైర్ కార్‌కు దాదాపు రూ. 1500-1600, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌కు రూ. 2200-రూ. 2500 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కత్రా-శ్రీనగర్-కత్రా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఈ మార్గంలో అన్ని ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.
వందేభారత్ రైల్లో ప్రత్యేక ఫీచర్లు
కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం, USBRL ప్రాజెక్ట్ కు సంబంధించి కత్రా-రియాసి సెక్షన్ లో రైల్వే అధికారులు ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) ట్రాక్ పనులను పరిశీలించి సమీక్షిస్తారు. CRS ఆమోదించబడిన తర్వాత రైలు ప్రారంభ తేదీ ప్రకటించనున్నారు. ఇక ఈ రైలు కోచ్ లోపల వెచ్చగా ఉండేలా హీటర్లు ఏర్పాటు చేశారు. అలాగే వాటర్ లైన్లు గడ్డకట్టకుండా ఉండేందుకు వీలుగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
Read Also: వందే భారత్ రైళ్ల టైమింగ్ మారింది.. వీటిలో మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి!