Anji Khad Cable Bridg: జమ్మూ కాశ్మీర్ లోదేశంలోని మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జి అయిన అంజి ఖాడ్ వంతెనపై ఇండియన్ రైల్వే సంస్థ తొలి ఎలక్ట్రిక్ టవర్ వ్యాగన్ తో ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ లో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడంలో భాగంగా రియాసి జిల్లాలో దీనిని నిర్మించారు. ఈ వంతెన మీదుగా వచ్చే ఏడాది జనవరి నుంచి రైల్వే సేవలు ప్రారంభంకానున్నాయి.
ట్రయల్ రన్ వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ టవర్ వ్యాగన్ ట్రయల్ రన్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జమ్మూకాశ్మీర్ కు రైల్వే కనెక్టివిటీని పెంచడంలో ఈ కేబుల్ బ్రిడ్జి కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. “ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్ట్ లో కీలకమైన అంజి ఖాడ్ వంతెనపై ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. జమ్మూకాశ్మీర్ కు రైల్వే కనెక్టివిటీని పెంచడంలో ఈ రైల్వే వంతెన కీలక పాత్ర పోషించనుంది”అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో పూర్తయిన అంజి ఖడ్ వంతెన.. నదీగర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఒకే పైలాన్ ను కలిగి ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందింది. మొత్తం 48 కేబుల్స్ సపోర్టుతో ఈ వంతెనను నిర్మించారు. దీని మొత్తం పొడవు 473.25 మీటర్లు. వయాడక్ట్ 120 మీటర్లు, సెంట్రల్ కరకట్ట 94.25 మీటర్లలో విస్తరించి ఉంది. ఇది చీనాబ్ వంతెన తర్వాత భారతదేశంలో రెండవ ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది. చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ రెండు వంతెనలు జమ్మూ కాశ్మీర్‌లో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక USBRL ప్రాజెక్ట్ లో భాగం కావడం విశేషం.
1st electric engine rolling through Tunnel No. 1 and the Anji Khad Cable Bridge.
📍J&K pic.twitter.com/YOjkeJmDva
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 25, 2024
Read Also: IRCTC పని చేయకపోయినా నో ప్రాబ్లం, ఈ సైట్లలో ఈజీగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు!
272 కిలో మీటర్ల మేర USBRL ప్రాజెక్ట్ నిర్మాణం
USBRL ప్రాజెక్ట్ 272 కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో 255 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కత్రా- రియాసి మధ్య మిగిలి ఉన్న నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉధంపూర్ -శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ (USBRL) భారత ఉపఖండంలో అత్యంత సవాలుగా ఉన్న రైల్వే ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రాజెక్ట్ శ్రీనగర్- జమ్మూ మధ్య ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుండి 3.5 గంటలకు తగ్గిస్తుంది. ప్రధాని మోడీ జనవరి 2025లో కాశ్మీర్- ఢిల్లీ మధ్య ప్రయాణించే తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించడంతో పాటు USBRLను జాతికి అంకితం చేయనున్నారు. జనవరి 26న ఈ రెండు ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే వందేభారత్ స్లీపర్ రైలు ట్రైయల్ రన్స్ కూడా సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. ఈ నెలాఖరులోగా మిగతా పరీక్షలు పూర్తి చేయనున్నారు.
Read Also: వందేభారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్, పట్టాలు ఎక్కేది అప్పుడేనా?