⦿ గ్రూప్-1 ఫలితాలకు లైన్ క్లియర్
⦿ హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట
⦿ రిజల్ట్స్ ఆపాలంటూ దాఖలైన పిటిషన్లు కొట్టివేత
⦿ సుజోయ్ పాల్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ నిర్ణయం
⦿ ఫలితాల విడుదలపై దృష్టిసారించిన టీజీపీఎస్సీ
హైదరాబాద్, స్వేచ్ఛ: TGPSC Group 1 Results: గ్రూప్-1 పరీక్ష విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. జీవో 29, రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై స్పష్టత వచ్చేంత వరకు ఫలితాలు ఆపాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. విచారణ జరిపిన డివిజనల్ బెంచ్ పూర్తి వాదనలు విన్న తర్వాత తోసిపుచ్చింది. జీవో 29ను సవాలు చేస్తూ దాఖలైన అన్ని రిట్ పిటిషన్లను జస్టిస్ సుజోయ్ పాల్‌తో కూడిన డివిజనల్ బెంచ్ కొట్టివేసింది.
పలు అవాంతరాలను కోర్టుల ద్వారా అధిగమించిన అనంతరం అక్టోబర్ 2-27 తేదీల మధ్య గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నెలలోగా ఫలితాలను కూడా ప్రకటిస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇటీవలే ప్రకటించారు. అయితే, రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కొంతమంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా అవాంతరాలు
గ్రూప్-1 పరీక్ష నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా చేయాలంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ బెంచ్ కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించినా అదే ఫలితం వచ్చింది. డివిజనల్ బెంచ్ కూడా పరీక్ష నిలిపివేతకు ససేమిరా అని చెప్పేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో డివిజన్ బెంచ్ ఏకీభవించింది. చివరి నిమిషంలో అభ్యర్థులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.
Also Read: CM Revanth Reddy: సీఎం సార్.. మీరే కరెక్ట్.. అస్సలు తగ్గొద్దు!
చివరి నిమిషంలో పరీక్షను నిలిపివేయలేమని, విషయాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో గ్రూప్ -1 పరీక్షలకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో అక్టోబర్ 21 – 27 తేదీల పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తీరా పరీక్షలు జరిగిన తర్వాత ఫలితాలు వాయిదా వేయాలంటూ పిటిషన్లు దాఖలవ్వడం గమనార్హం. మొత్తంగా అడ్డంకులు తొలగిపోవడంతో ఫలితాల ప్రకటనపై టీజీపీఎస్సీ దృష్టిసారించింది. వచ్చే ఏడాది మార్చిలోగా రిజల్ట్స్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.