Indian Railways Fined Rs.30,000: రైల్వే నిర్లక్ష్యం పై వినియోగదారుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రైల్వే మీద ఉందని గుర్తు చేసింది. మొహాలీకి చెందిన ప్రయాణికుడి కేసులో తాజాగా తీర్పు వెల్లడించింది. అతడికి రూ.30,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ చర్చనీయాంశంగా మారింది.
ఫిర్యాదుదారుడు సురీందర్ కుమార్ మున్షీ.. 2023 నవంబర్ 22న జమ్మూ తావి నుంచి బాంద్రా టెర్మినస్ కు వెళ్లే ప్రత్యేక రైలు (నెం. 09098)లో AC 3 టైర్ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు. ప్రయాణం ప్రారంభమైన తర్వాత, కోచ్ లోని టాయిలెట్లన్నీ చాలా మురికిగా ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయని గుర్తించారు. ఆయన వెంటనే టిటిఈకి ఈ విషయం తెలియజేశారు. అంబాలా, మథుర, కోట, రత్లాం లాంటి పలు స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా, రైల్వే అధికారిక ఫిర్యాదు వ్యవస్థ అయిన రైల్ మదాద్ ద్వారా కూడా కంప్లైంట్ నమోదు చేశారు. అయినప్పటికీ ఎక్కడా సరైన స్పందన రాలేదు.
ఇంకా విచిత్రంగా, రైల్వే అధికారులు ఈ వ్యవహారంపై స్పష్టత లేని సమాధానాలు ఇచ్చారు. ఒకసారి సిబ్బందికి క్లీనింగ్ సూచనలు ఇచ్చాం అని, మరొకసారి సిబ్బంది కొరత వల్ల సేవలు అందించలేకపోయామని చెప్పారు. ఈ పరస్పర విరుద్ధ సమాధానాలు కూడా కమిషన్ దృష్టికి వచ్చాయి. ఫిర్యాదుదారు సమర్పించిన ఫోటోలు పరిశీలించిన తరువాత, టాయిలెట్ల పరిస్థితి నిజంగానే చాలా చెత్తగా ఉందని కమిషన్ నిర్ధారించింది. ఈ సందర్భంగా రైల్వే చేసిన వాదనను కూడా కమిషన్ ఖండించింది. పారిశుధ్య సౌకర్యాలు మానవతా కోణంలో అందించేవి, అవి సేవలో భాగం కావనే వాదనను పూర్తిగా తిరస్కరించింది. ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసి చెల్లించే డబ్బులో ఈ సౌకర్యాలు కూడా భాగమే. అందువల్ల శుభ్రత వంటి ప్రాథమిక సదుపాయాలు అందించడం రైల్వే బాధ్యతే అని కమిషన్ తేల్చి చెప్పింది. క్లీనింగ్ పనిని కాంట్రాక్టర్‌కు అప్పగించినప్పటికీ, అసలు బాధ్యత రైల్వేదేనని స్పష్టం చేసింది. ఇది తమ పని కాదని తప్పించుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది.
కేసు వివరాలను పరిశీలించి ప్రయాణికుడు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, అసౌకర్యం, కేసు ఖర్చులను పరిగణనలోకి తీసుకుని, మొత్తం రూ.30,000 పరిహారం చెల్లించాలని రైల్వేకు ఆదేశించింది. ఇందులో రూ.15,000ను లీగల్ ఎయిడ్ ఖాతాలో, మిగతా రూ.15,000ను ట్రైసిటీ కన్స్యూమర్ కోర్ట్స్ బార్ అసోసియేషన్‌కు 30 రోజుల్లో జమ చేయాలని చెప్పింది. ఈ ఘటన రైల్వే సేవల్లో శుభ్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. ప్రయాణికులు చెల్లించే ధరకు తగిన కనీస సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత సంస్థలపై ఉందని స్పష్టం చేసింది.
Read Also: ఏపీకి గుడ్ న్యూస్, కాకినాడ నుంచి మైసూరు వరకు డైరెక్ట్ రైలు వచ్చేస్తోంది!