Vande Bharat Express: ప్రయాణికుల కోసం రైల్వే శాఖ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వందేభారత్ కు ప్రయాణీకుల ఆదరణ అధికం కావడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో లక్షల మంది ప్రయాణికులకు మేలు చేకూరనుంది.
మంగళూరు సెంట్రల్ – తిరువనంతపురం సెంట్రల్ మధ్య నడుస్తున్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ 20631, 20632 నంబర్లకు మే 22వ తేదీ నుంచి 16 బోగీలతో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ఇప్పటి వరకు 8 బోగీలతో నడుస్తున్న ఈ వేగవంతమైన సేవ, ప్రయాణికుల నుంచి విపరీతమైన స్పందన పొందింది. దాంతో పాటు బుకింగ్స్ ఎక్కువగా ఉండటంతో రైల్వే అధికారులు 16 కోచ్‌లుగా పెంచాలని నిర్ణయించారు. ఈ మార్పు మంగళూరు నుండి తిరువనంతపురం, తిరువనంతపురం నుండి మంగళూరు మార్గాల్లో అమలులోకి రానుంది.
ప్రయాణికులకు ఏంటి ప్రయోజనం?
పెరిగిన బోగీల వలన మరిన్ని ప్రయాణికులు సీట్లు పొందగలుగుతారు. టికెట్ల కొరత తగ్గి, వెయిటింగ్ లిస్ట్ తగ్గే అవకాశం ఉంది. వందే భారత్ ట్రైన్లు ఇప్పటికే ఇతర రైళ్లతో పోలిస్తే అధిక వేగాన్ని అందుకొని గమ్యానికి చేరవేస్తాయి. ఈ రైలులో బయో టాయిలెట్లు, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత సమాచారం, వైఫై, రీడింగ్ లైట్స్, పలు సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ముఖ్యమైన స్టేషన్లు ఇవే..
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళూరు నుండి బయలుదేరి కాసరగోడ్, కన్నూరు, తలశెరి, కోజికోడ్, తిరుర్, షోర్నూర్, త్రిసూర్, ఎర్నాకుళం, ఆలప్పుఝా, కొల్లం మీదుగా తిరువనంతపురానికి చేరుతుంది. దక్షిణ రైల్వే ప్రకారం, ఈ మార్పు వల్ల తీర ప్రాంత రాష్ట్రాలైన కర్ణాటక, కేరళల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన రైల్వే సేవలు లభించనుంది. రాకపోకలు పెరిగే సమయాల్లో కూడా ప్రయాణికులు సులభంగా టికెట్లు పొందగలుగుతారని అంచనా.
Also Read: Heavy Rain Alert: రైతన్నలకు వర్షాల గిఫ్ట్.. నైరుతి వానలు ముందే.. IMD ప్రకటన..
ప్రయాణికులకు సూచన..
ఈ మార్పుతో పాటు, ట్రైన్ షెడ్యూల్, బుకింగ్ వివరాలు IRCTC వెబ్‌సైట్, రైల్వే ఎంక్వైరీ యాప్ ద్వారా చెక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. మరెందుకు ఆలస్యం.. దక్షిణ రైల్వే మీకోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించండి.. అలాగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోండి.