భారతీయ రైల్వే ప్రయాణీకులకు ముందస్తు అలర్ట్ జారీ చేసింది. రైల్వే అధికారిక టికెట్ బుకింగ్ సైట్ IRCTC వెబ్ సైట్ తో పాటు యాప్ సేవలను సుమారు 6 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 1న రాత్రి 11:45 నుండి నవంబర్ 2న ఉదయం 5:30 వరకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యవస్థను తాత్కాలికంగా షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో, ప్రయాణీకులు టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, కరెంట్ రిజర్వేషన్లు, PNR స్టేటస్ చెకింగ్, ఎంక్వయిరీ లాంటి సేవలను పొందలేరని తెలిపింది.
కోల్ కతాలోని IRCTC, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS) సర్వర్లలో డేటా కంప్రెషన్, టెక్నాలజీ అప్ గ్రేడ్ లను నిర్వహించడానికి ఈ షట్ డౌన్ అమలు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఈ సమయంలో అన్ని కీలకమైన రైల్వే డేటాబేస్‌లు, ముఖ్యంగా PNR ఫైల్స్, రిజర్వేషన్ రికార్డులు మరింత ఆధునీకరించనున్నట్లు తెలిపింది. టికెట్ బుకింగ్ వ్యవస్థను వేగంగా, భవిష్యత్ డిజిటల్ అవసరాలకు అనుగుణంగా మార్చడానికి కొంత సమయం పాటు IRCTC డౌన్ చేయాల్సి వస్తుందని తెలిపింది.
IRCTC వెబ్ సైట్ డౌన్ చేయడం వల్ల రైల్వేకు చెందిన పలు సర్వీసుల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇంతకీ అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ (IRCTC వెబ్‌సైట్, యాప్)
⦿ ప్రస్తుత రిజర్వేషన్, చార్టింగ్ సిస్టమ్
⦿ టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ సర్వీసులు
⦿ 139 విచారణ సర్వీసు
⦿ NTES (నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్)
⦿ PRR (ప్యాసింజర్ రిజర్వేషన్ రికార్డ్), EDR (ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్)
⦿ పలు రైల్వే మొబైల్ యాప్స్, ప్రైమస్ అప్లికేషన్
Read Also: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, అదే మార్గంలో దూసుకొచ్చిన ఎక్స్ ప్రెస్..
వెబ్ సైట్ డౌన్ అయిన సమయంలో టిక్కెట్లను బుక్ చేసుకోవడం లేదంటే రద్దు చేసుకోవడం మానుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ప్రయాణం నవంబర్ 1 రాత్రి లేదంటే నవంబర్ 2న ఉదయం ఉంటే, ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయాణీకులకు ఇబ్బందిని తగ్గించేందుకే రాత్రిపూట సర్వర్ అప్ డేట్ చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. సిస్టమ్ అప్ గ్రేడ్ పూర్తయిన తర్వాత అన్ని సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నారు అధికారులు. “ఈ అప్ గ్రేడ్ వల్ల వేగవంతమైన బుకింగ్, రియల్ టైమ్ అప్ డేట్స్ అందుతాయి. డేటా మరింత భద్రతతో కూడుకుని ఉంటుంది. సర్వర్ డౌన్ లాంటి సాంకేతిక లోపాలు తగ్గుతాయి. నెట్ వర్క్ పనితీరు మరింత మెరుగవుతుంది” అని రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: మొంథా ఎఫెక్ట్, వందేభారత్ సహా పలు రైల్వే సర్వీసులు బంద్!