YS Jagan: ఏపీలో మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 25 జిల్లాల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. తుఫాన్ కారణంగా 15 లక్షల ఎకరాల పంటలు ముంపుకు గురై నష్టపోయాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కడప, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంటలు నీటమునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. 11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టపోగా, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి పంట, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, అలాగే 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలతో పాటు గృహాలు, గోడౌన్లు, రహదారులు, విద్యుత్ లైన్లు కూడా దెబ్బతిన్నాయి. రైతుల ఆస్తి నష్టం కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు అధికారులు.
మొంథా తుఫాన్ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రతి రైతు బాధ మనదే. మనం వారితో పాటు ఉండాలి అని అన్నారు. ఇది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదు, ఇది ‘మ్యాన్‌మేడ్ డిజాస్టర్’ కూడా. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే దీనికి కారణం. పంటల రక్షణకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. తుఫాన్ హెచ్చరికలు ముందుగానే వచ్చినా, రైతులను, పంటలను రక్షించే ప్రయత్నం చేయలేదు తీవ్రంగా మండిపడ్డారు.
కూటమి 16 నెలల పాలనలో 16 విపత్తులు వచ్చాయి అని జగన్ విమర్శించారు. ప్రతి విపత్తు తర్వాత రైతులకే భారమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల కష్టమే కనిపిస్తోంది. ఇన్‌పుట్ సబ్సిడీ ఎన్ని మందికి ఇచ్చారు? తుఫాన్‌ల వల్ల నష్టపోయిన రైతులను ఎంతమందిని ఆదుకున్నారు?” అని ప్రశ్నించారు.
రైతు మన వెన్నుముక. పంట నష్టం అంచనాలో ప్రతి ఒక్క రైతు పక్కనే నిలబడాలి. మునుపటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మేము ప్రతి విపత్తు తర్వాత తక్షణ సహాయం అందించాము. ఇప్పుడే ఏమయిందో ప్రజలకు కనిపిస్తోంది.
ప్రభుత్వ యంత్రాంగం పంట నష్టం అంచనాకు బృందాలను పంపింది. అయితే, రైతులు మాత్రం అంచనాలు కాకుండా తక్షణ సహాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా జిల్లాల్లో వరి మోగు దశలో ఉండగా నీటమునిగిపోవడంతో పంట మొత్తం పాడైపోయింది.
రైతుల కుటుంబాల్లో కన్నీటి వాతావరణం నెలకొంది. సీజన్ మొత్తం కష్టపడి పండించిన పంట ఒక్క రాత్రిలో పోయింది అని బాధపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం అంచనాలు పూర్తి చేసి, రైతులకు సబ్సిడీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పంట నష్టం అంచనా సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అండగా నిలబడాలి. నష్టం వివరాలు సేకరించి, ప్రభుత్వం ముందు ఉంచాలి. ఇది రైతుల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం అని తెలిపారు.