Indian Railways NRI Booking: భారత్‌లో రైలు ప్రయాణం చేయాలనుకునే ఎన్నారైలకు రైల్వే సూపర్ న్యూస్ చెప్పింది. సాధారణంగా రైలు టిక్కెట్లను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే విదేశాల్లో నివసిస్తూ, విదేశీ మొబైల్ నంబర్లు ఉపయోగించే భారతీయులకు ఫారిన్ టూరిస్ట్ కోటా (FTQ) కింద కొత్త బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంపిక చేసిన రైళ్లలో ఏడాది ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
భారతీయ రైల్వే ఫారిన్ టూరిస్ట్ కోటా ద్వారా ఇతర దేశాల మొబైల్ నంబర్లు కలిగిన ప్రయాణికులు ముందస్తు బుకింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఇందుకోసం IRCTC వెబ్‌సైట్‌లో తమ విదేశీ మొబైల్ నంబర్ తో లాగిన్ కావాలి. ఇందుకోసం ఒకేసారి రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో అర్హత కలిగిన ప్రయాణికులకు ఎంపిక చేసిన రైళ్లలో 365 రోజుల ముందుగానే ఫస్ట్ క్లాస్ (1A) టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ప్రయాణికులకు 60 రోజుల ముందే బుకింగ్ అందుబాటులో ఉంటే, ఎన్నారైలు మరింత ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే, టికెట్ కన్ఫర్మేషన్, కోటా అవైలబులిటీకి సంబంధించిన రూల్స్ వర్తిస్తాయి.
బెంగళూరు, ముంబై మధ్య ప్రయాణించే వారికి ఈ సదుపాయం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెండు నగరాలను కలిపే వందే భారత్ సర్వీసు పుణె మీదుగా ప్రయాణిస్తుంది. రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ముంబై, బెంగళూరు నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసేవారికి కూడా ఈ రైలు ఉపయోగపడనుంది.
ఈ ప్రయాణంలో ఏసీ ఫస్ట్ క్లాస్ (1A) టికెట్ తీసుకోవాలని ఎన్నారై కౌన్సిలర్ నూపుర్ డేవ్ సూచించారు. ఇందులో ప్రైవేట్ క్యాబిన్ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుంది. ఒక్కో ప్రయాణికుడికి 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. టికెట్ ధర సుమారు 50 డాలర్లుగా ఉంటుందని వెల్లడించారు. అయితే, ఈ రైలు వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉండదు. సోమవారం, మంగళవారం రోజుల్లో సర్వీసు నడవదన్నారు.
ఫారిన్ టూరిస్ట్ కోటా ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలంటే IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సంబంధిత రిజిస్ట్రేషన్, బుకింగ్ విధానాన్ని ఫాలో కావాలి. దీనికి సంబంధించి అవగాహన లేని వారు IRCTC బుకింగ్ గురించి తెలిసిన ట్రావెల్ ఏజెంట్ సహాయం తీసుకోవచ్చని నూపుర్ సూచించారు. విదేశాల్లో నివసిస్తూ భారత్‌కు తరచూ వచ్చే ఎన్నారైలు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఫస్ట్ క్లాస్ టికెట్ల కోసం చివరి నిమిషం వరకు ఎదురుచూడాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చు.
Read Also:గాల్లోనే దీపావళి సంబరాలు.. పైలట్ చేసిన పనికి ప్రయాణికులు ఫిదా!