Train Food Delivery Scam: రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలామంది ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్లడానికి బదులుగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ లోనే నచ్చిన ఫుడ్ తెప్పించుకునే సౌకర్యం ఉండటంతో ఈ విధానానికి ఆదరణ పెరుగుతోంది. అయితే, ఇదే అదనుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వెబ్‌సైట్‌లు, అనధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్లు తీసుకుంటూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఫుడ్ ఆర్డర్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రైళ్లలో ఫుడ్ డెలివరీ పేరుతో అందుబాటులోకి వస్తున్న కొన్ని అనధికారిక ప్లాట్‌ఫారమ్‌లు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతున్నాయని IRCTC తెలిపింది. ముఖ్యంగా ఫుడ్ క్వాలిటీ, ఆర్థిక మోసాలు, వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేయడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని వెబ్‌సైట్‌లు, యాప్‌లు తక్కువ ధరలకు భోజనం అందిస్తామని యాడ్స్ ఇస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. వాటి ద్వారా ఆర్డర్ చేసిన తర్వాత క్వాలిటీ లేని ఫుడ్ అందించడం లేదంటే చెల్లించిన డబ్బులు తిరిగి రాకపోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రయాణికుల ఫోన్ నంబర్లు, చెల్లింపులకు సంబంధించిన వివరాలు మిస్ యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
అనధికారిక ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా లైసెన్స్ లేని హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెస్తున్నాయని IRCTC వెల్లడించింది. ఇలాంటి కేంద్రాలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) రూల్స్ పాటిస్తున్నాయో లేదో తెలుసుకోవడం కష్టమవుతుంది. కొన్ని చోట్ల ఫుడ్ అపరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారు చేసే అవకాశం ఉంది. వంట చేసే సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడం, పరిశుభ్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఆహార భద్రతకు ముప్పుగా మారవచ్చు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ప్రయాణికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
ఈ సమస్యలను అరికట్టేందుకు IRCTC అనధికారిక ఇ-క్యాటరింగ్ వెబ్‌సైట్‌లు, యాప్‌లపై చర్యలను ముమ్మరం చేసింది. ప్రయాణికులు భోజనం ఆర్డర్ చేయాలంటే అధికారిక IRCTC వెబ్‌సైట్ లేదంటే ‘Food on Track’ మొబైల్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. అలాగే IRCTC గుర్తించిన అధికారిక భాగస్వాముల ద్వారా కూడా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. తెలియని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయడం, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం, గుర్తుతెలియని ప్లాట్‌ఫారమ్‌లకు ఆన్‌లైన్ చెల్లింపులు చేయకూడదని వెల్లడించింది.
Read Also: దీపావళి వేళ రైల్లో టపాసులు తీసుకెళ్తున్నారా? జరిమానే కాదు జైలు శిక్షా తప్పదు!