IndiGo flight: బెంగళూరు నుంచి లక్నోకు ఇండిగో విమానంలో తీవ్ర కలకలం రేగింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే హైజాక్ బెదిరింపు వచ్చాయి. దీంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు బెంగళూరులో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన వెనుక అసలు ఏం జరిగింది?
శనివారం సాయంత్రం బెంగళూరు నుంచి లక్నో వెళ్తోంది ఇండిగో 6E-451 గల విమానం. విమానంలోని టాయిలెట్‌లో చేతి రాతతో ఉన్న బెదిరింపు లేఖను గుర్తించాడు ఓ ప్రయాణికుడు. సాయంత్రం 6.30 గంటలకు ఈ విమానాన్ని హైజాక్ చేస్తామని లేఖలో రాసివుంది. ఈ లేఖను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రస్తావించారు.
ఆ లేఖ చూసిన షాకైన సదరు ప్రయాణికుడు వెంటనే క్యాబిన్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు పైలట్లను అప్రమత్తం చేసి అసలు విషయం చెప్పారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పైలట్లు విమానాన్ని గాల్లో నుంచి తిరిగి బెంగళూరుకు మళ్లించారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో విమానం సేఫ్‌గా ల్యాండింగ్ తర్వాత భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు.
దాదాపు రెండు గంటలపాటు విమానాన్ని తనిఖీ చేశారు. అధికారులు చేసిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఎవరో కావాలని ఇది చేసి ఉంటారని అధికారులు నిర్ధారించారు. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత రాత్రి వేళ మళ్లీ ఇండిగో విమానం బెంగుళూరు నుంచి తిరిగి లక్నోకు బయలు దేరింది.
ALSO READ: దేశంలో వింత స్టేషన్.. రైలు ఎక్కాలంటే టికెట్ ఒక్కటే సరిపోదు.. వీసా, పాస్‌పోర్ట్ కూడా ఉండాల్సిందే!
ఒకప్పుడు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్స్ పదేపదే వచ్చాయి. వీటిపై అధికారులు ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు విమానాల వంతైంది. వారం లేదు రెండు వారాలకు ఇలాంటి ఘటనలు విమానాల్లో జరుగుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను గమనించిన ప్రయాణికులు, కాసింత బెంబేలెత్తుతున్నారు.