Firecrackers on Trains: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. సొంతూళ్లకు వెళ్లేవారి హడావుడి మొదలవుతుంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల కోసం స్వీట్లు, బహుమతులతో పాటు టపాసులు కూడా తీసుకెళ్లాలని కొందరు అనుకుంటారు. అయితే, రైలులో టపాసులు తీసుకెళ్తే ఇబ్బందులు తప్పవు. భారీ జరిమానా, జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే రైలు ప్రయాణికులు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
బాణసంచా అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాల లిస్టులోకి వస్తుంది. రైలు బోగీల్లో వందలాది మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణిస్తుంటారు. ఇలాంటి సమయంలో టపాసులు తీసుకెళ్లడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ప్రయాణ సమయంలో బ్యాగులు ఒకదానికొకటి తగలడం, చిన్నపాటి నిప్పురవ్వలు తగలడం వల్ల కూడా టపాసులు పేలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైలు బోగీలు మూసి ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించవచ్చు. దీనివల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే బాణసంచా రవాణాపై కఠిన ఆంక్షలు విధించింది. రైల్వే స్టేషన్లలోని ప్లాట్ఫారాలు, రైలు బోగీల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది చెకింగ్స్ నిర్వహిస్తుంటారు. ఈ తనిఖీల్లో నిషేధిత పేలుడు పదార్థాలు కనిపిస్తే సంబంధిత ప్రయాణికులపై చర్యలు తీసుకుంటారు. టపాసులను బ్యాగుల్లో దాచిపెట్టి తీసుకెళ్లినా చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. తనిఖీల నుంచి తప్పించుకోవచ్చని భావించి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు.
రైలులో నిషేధిత పేలుడు పదార్థాలను తీసుకెళ్లడం రైల్వే చట్ట నిబంధనలకు విరుద్ధం. రైల్వే చట్టం సెక్షన్ 164 ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.1,000 వరకు జరిమానా లేదంటే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రైళ్లలో ప్రయాణించే సమయంలో టపాసులు, పేలుడు పదార్థాలు, మండే స్వభావం ఉన్న వస్తువులను తీసుకెళ్లకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వాటిని లగేజీలో దాచి తీసుకెళ్లడం కూడా ప్రమాదకరమే. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీపావళి ఆనందంగా జరుపుకోవడం ఎంత ముఖ్యమో, ప్రయాణంలో తోటి ప్రయాణికుల భద్రతను కాపాడటం కూడా అంతే ముఖ్యం. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. అందుకే, టపాసులను రైలులో తీసుకెళ్లకుండా, రైల్వే నిబంధనలను పాటిస్తూ సేఫ్ గా ప్రయాణించండి.
Read Also: రాముడి ఊరి నుంచి సీతమ్మ ఊరికి రైలు.. ప్రయాణికులకు త్వరలోనే కొత్త సౌకర్యం!