Indian Railways Special Concessions: చాలా మంది విద్యార్థులు తరచుగా రైల్వే ప్రయాణం చేస్తుంటారు. వారిలో చాలా మంది భారతీయ రైల్వే సంస్థ అందిస్తున్న ప్రత్యేక రాయితీల గురించి తెలియదు. సాధారణంగా టికెట్ తీసుకుని జర్నీ చేస్తారు. అయితే, విద్యార్థులకు రైల్వే సంస్థ టికెట్ ఛార్జీపై ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. ఈ రాయితీని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్లు
⦿ రైల్వే సంస్థ జనరల్ క్లాస్ లో బాల బాలికలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నది. ఈ రాయితీ గ్రాడ్యుయేషన్ వరకు పొందే అవకాశం ఉంది. ఇందులో భాగంగా MST(మంత్లీ సీజన్ టిక్కెట్)ను అందిస్తుంది.
⦿ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసేందుకు రైల్లో ప్రయాణం చేస్తే టిక్కెట్లపై 75 శాతం రాయితీ అందిస్తుంది. ఈ రాయితీ కేవలం జనరల్ క్లాస్ టికెట్ మీదే లభిస్తుంది.
⦿యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే మెయిన్స్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు రైలు ఛార్జీలలో 50 శాతం రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం జనరల్ క్లాస్ టికెట్ మీదే పొందే అవకాశం ఉంటుంది.
⦿ ఇంటికి దూరంగా నివసిస్తున్న విద్యార్థులు తమ సొంత ఊరికి వచ్చేందుకు రైళ్లలో రాయితీ టిక్కెట్లు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చేపట్టే ఎడ్యుకేషనల్ టూర్లకు కూడా ఇదే సౌకర్యం పొందవచ్చు. ఈ సదుపాయం కింద జనరల్ కేటగిరీ విద్యార్థులు స్లీపర్-క్లాస్ టిక్కెట్లపై 50 శాతం తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఎస్సీఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు 75 శాతం తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.
⦿ రీసెర్చ్ చేసే విద్యార్థులకు ప్రత్యేక రాయితీలను అందిస్తున్నది రైల్వే సంస్థ. 35 ఏళ్లలోపు విద్యార్థులు పరిశోధనల కోసం రైల్వే ప్రయాణం చేసినట్లైతే టిక్కెట్లపై 50 శాతం తగ్గింపును అందిస్తోంది. స్లీపర్ క్లాస్ టిక్కెట్లపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంది.
⦿ ఒక విద్యార్థి వర్క్ క్యాంప్ లో పాల్గొనేందుకు రైలు ప్రయాణం చేస్తే స్లీపర్ క్లాస్ టిక్కెట్లపై 25 శాతం తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.
⦿ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సంవత్సరానికి ఒకసారి స్టడీ టూర్ కోసం జనరల్ క్లాస్ రైలు టిక్కెట్లపై 75 శాతం రాయితీని పొందవచ్చు.
⦿ భారత్ లో చదువుతున్న విదేశీ విద్యార్థులు భారత ప్రభుత్వం నిర్వహించే క్యాంప్, సెమినార్ కు హాజరయ్యేందుకు రైలు ప్రయాణం చేస్తే స్లీపర్ క్లాస్ టిక్కెట్లపై 50 శాతం తగ్గింపు పొందే అవకాశం ఉంది. సెలవుల్లో చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు కూడా ఇదే రాయితీ అందించబడుతుంది.
⦿ మర్కంటైల్ మెరైన్ నావిగేషనల్, ఇంజనీరింగ్ శిక్షణ కోసం వెళ్లే క్యాడెట్లు, మెరైన్ ఇంజనీర్ అప్రెంటిస్ లు 50 శాతం రాయితీని పొందే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు టికెట్లపై రాయితీ ఎలా పొందాలంటే?
విద్యార్థులు టికెట్లపై రాయితీ పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ విద్యార్థులకు టికెట్లపై రాయితీ అనేది జనరల్, స్లీపర్ క్లాస్ లో మాత్రమే పొందే అవకాశం ఉంటుంది.
⦿ విద్యార్థుల వయసు 25 ఏండ్లలోపు ఉండాలి. కొన్నిసార్లు 35 ఏండ్ల వరకు అనుమతిస్తారు.
⦿ ఈ డిస్కౌంట్ ఆన్ లైన్ లో ఉండదు. కేవలం ఆఫ్ లైన్ ద్వారానే పొందాలి.
⦿ టికెట్లపై రాయితీ పొందేందుకు అప్లికేషన్ ఫారమ్ మీద ప్రిన్సిపల్ సంతకం తీసుకోవాల్సి ఉంటుంది.
Read Also: సంక్రాంతికి మరో 60 స్పెషల్ రైళ్లు, సౌత్ సెట్రల్ రైల్వే గుడ్ న్యూస్!