Indian Railways: హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు MMTS రైళ్లను ప్రవేశపెట్టాలని గత కొంతకాలంగా ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు సమ్మర్ స్పెషల్ రైళ్లు ఇక్కడి నుంచే నడుస్తున్నాయి. ఈ రైళ్లలో చాలా వరకు రాత్రిపూట రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్లపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల, ప్రయాణీకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరిలో రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. చర్లపల్లితో పోల్చితే హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మల్కాజ్ గిరి అనుకూలంగా ఉంటుందంటున్నారు. రవాణా సౌకర్యాలు కూడా ఎక్కువగా ఉంటాయంటున్నారు.
మల్కాజ్ గిరి రూట్ లోనే కాచిగూడకు రైళ్లు
నిజానికి కాచిగూడకు వెళ్లే రైళ్లు మల్కజిగిరి రూటులో వెళ్లాయి. అక్కడ ట్రైన్ ఆగగానే చాలామంది దిగిపోతారు. అందుకే.. రైలు మల్కాజ్ గిరి నుంచి కాచిగూడకు వెళ్లాలంటే సుమారు మరో 30 నుంచి 45 నిమిషాలు తీసుకుంటుంది. ఒక్కోసారి గంట కూడా పట్టవచ్చు. అందుకే.. ప్రయాణీకులు మల్కాజ్ గిరిలో దిగిపోయి.. దానికి దగ్గరలో ఉన్న మెట్టుగూడ మెట్రో స్టేషన్‌కు వెళ్లిపోతున్నారు. కొందరు అక్కడే ఉండి ఎంఎంటీఎస్ ఎక్కుతున్నారు. అయితే, చర్లపల్లికి దగ్గరలో కూడా మెట్రో ఉంటే జనాలకు సదుపాయంగా ఉండేది. కనీసం ఎంఎంటీసీ రైలు రెగ్యులర్‌గా నడిపినా రిలీఫ్ ఉంటుంది.
మల్కాజ్ గిరికి దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్లు
మల్కాజ్ గిరిలో రైళ్లు ఆపడం వల్ల చాలా లాభాలున్నాయి. మల్కాజ్ గిరి రైల్వే స్టేషన్ కు దగ్గరగా మెట్టుగూడ మెట్రో స్టేషన్ ఉంటుంది. మల్కాజ్ గిరి నుంచి సుమారు 2.36 కి.మీ దూరంలో ఉంది. అంతేకాదు, 2.63 కిలో మీటర్ల దూరంలో తార్నాక మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. సికింద్రాబాద్ తూర్పు మెట్రో స్టేషన్ 3.57 కి.మీ దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ కూడా సమీపంలోనే ఉంది. మల్కాజ్ గిరి నుంచి 3.56 కి.మీ దూరంలో ఈ స్టేసన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణీకులు తమ ప్రాంతాలకు ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్ గిరిలోనూ రైళ్లను ఆపాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదంటున్న ప్రయాణీకులు
చర్లపల్లి నుంచి మెరుగైన రవాణా వసతులు కల్పించాలని రైల్వే అధికారులను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోవడం లేదని సబర్బన్ రైలు, బస్సు ప్రయాణీకుల సంఘం ప్రధాన కార్యదర్శి నూర్ ఆవేదన వ్యక్తం చేశారు. “చర్లపల్లి నుంచి రవాణా సౌకర్యాలు సరిగా లేవని సంబంధిత అధికారులకు పదే పదే చెప్పాం. అయినా పట్టించుకోవడం లేదు. సికింద్రాబాద్ స్టేషన్ స్టేషన్ నుంచి పలు రైళ్లను ఇప్పుడు చర్లపల్లి నుంచి దారి మళ్లిస్తున్నారు. చర్లపల్లి టెర్మినల్‌లో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం ప్రయాణీకులను అసౌకర్యానికి గురి చేస్తోంది. టెర్మినల్ నుంచి కనెక్టివిటీని మెరుగుపరచడానికి కొన్ని MMTS రైళ్లను ప్రవేశపెడితే మంచిది. బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తే బాగుటుంది. అటు మల్కాజ్ గిరిలోనూ రైళ్లకు హాల్టింగ్ ఇస్తే బాగుంటుంది” అన్నారు నూర్.
Read Also: తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ ట్రైన్.. వచ్చేది అప్పుడేనా?