Indian Railways: భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చిన రైలు వందేభారత్ ఎక్స్ ప్రెస్. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు రూపొందాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్లను తయారు చేశారు. ఈ రైళ్లు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. గంటకు గరిష్టంగా 180 కిలో మీటర్లతో పరుగులు తీసే వందేభారత్ స్లీపర్ రైళ్లు(Vande Bharat Sleeper Trains) త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించబోతున్నాయి. తాజాగా వందేభారత్ స్లీపర్ రైలు కోటా డివిజన్ లో ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు రైలు ట్రయల్ రన్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రైలు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.
వందేభార్ స్లీపర్ రైలు ఫీచర్లు
సుదూర రాత్రి ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించిన ఈ రైళ్లు 16 కోచ్ లతో అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 11 AC 3-టైర్ కోచ్‌లు ఉండగా, వాటిలో 611 సీట్లు ఉంటాయి. 4 AC 2-టైర్ కోచ్‌లు ఉంటాయి. ఇందులో 188 సీట్లు ఉంటాయి. 1 AC ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటుంది. ఇందులో 24 సీట్లు ఉంటాయి. ఒక్కో వందేభారత్ స్లీపర్ రైలులో మొత్తం ప్రయాణీకుల సంఖ్య 823 ఉంటుంది. వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ లో గరిష్టంగా 180 కి.మీ. వేగాన్ని అందుకుంది. అయితే 160 కి.మీ వేగంతో నడపాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రైళ్లలో ఎర్గోనామిక్ స్లీపర్ బెర్త్‌లు, ఆటోమేటిక్ డోర్లు, Wi-Fi, ప్రతి సీటు దగ్గర USB ఛార్జింగ్ పోర్ట్‌లు, షవర్లతో కూడిన ఆధునిక టాయిలెట్లు, మెరుగైన సౌండ్ ఇన్సులేషన్, ప్రమాద ముప్పును తగ్గించేందుకు కవచ్ వ్యవస్థ, అగ్ని నిరోధక పదార్థాలు, డిఫార్మేషన్ జోన్‌లు, రీన్ ఫోర్స్డ్ బఫర్లు అమర్చబడి ఉన్నాయి.
Read Also: వామ్మో పాము.. ఏకంగా బుల్లెట్ ట్రైన్నే ఆపేసింది కదయ్యా!
తొలి విడుతలోనే తెలుగు రాష్ట్రాలకు 3 రైళ్లు
వందేభారత్ స్లీపర్ రైళ్లను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును తిరువనంతపురం నుంచి మంగళూరు మధ్యలో నడిపించనున్నట్లు తెలుస్తోంది. తిరువనంతపురం నుంచి బెంగళూరు, కన్యాకుమారి నుంచి – శ్రీనగర్ కు మరో రైలును నడపాలని భావిస్తున్నారు. జమ్మూ నుంచి శ్రీనగర్ కు మరో రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలి విడుతలో భాగంగానే సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి, సికింద్రాబాద్ – బెంగళూరు మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. త్వరలోనే వందేభారత్ రైళ్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
Read Also: మారిన టికెట్ బుకింగ్ రూల్స్.. ఇకపై అది తప్పనిసరి!