Vijayawada Railway Division Record: సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్ మరోసారి అరుదైన గుర్తింపు సాధించింది. జూలై 6న ఏకంగా 97.35 శాతం టైమ్ మెయింటెనెన్స్ సాధించి కొత్త రికార్డు సృష్టించింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ఒకటిగా పేరున్న విజయవాడ డివిజన్‌లో ఈ రేంజ్ సమయపాలన నమోదు చేసి వారెవ్వా అనిపించుకుంటుంది.
జూలై 6న విజయవాడ డివిజన్ పరిధిలో మొత్తం 192 రైళ్లు నడిచాయి. అధిక సంఖ్యలో రైళ్లు నడిచినప్పటికీ, దాదాపు అన్నీ నిర్ణయించిన సమయానికే గమ్యస్థానాలకు చేరుకోవడం ద్వారా ఈ రికార్డు సాధ్యమైంది. దీంతో గతంలో నమోదైన రికార్డును కూడా విజయవాడ డివిజన్ అధిగమించింది. ఇంతకుముందు 2025 ఆగస్టు 6న 181 రైళ్లను నడుపుతూ 97.24 శాతం సమయపాలన నమోదు చేసింది. ఇప్పుడు 192 రైళ్లను నిర్వహిస్తూ 97.35 శాతం సమయపాలన సాధించడం ద్వారా ఆ రికార్డును బ్రేక్ చేయడంతో పాటు కొత్త మైలురాయిని చేరుకుంది.
ఈ విజయానికి సమర్థవంతమైన ప్రణాళిక, అన్ని విభాగాల మధ్య సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, సిబ్బంది కృషి ప్రధాన కారణాలని విజయవాడ డివిజన్ అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్లను నిర్వహించగలగడం డివిజన్ పనితీరును ప్రతిబింబిస్తోందన్నారు.
వాస్తవానికి టైమ్ మెయింటెనెన్స్ వల్ల ప్రయాణికులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రైళ్లు సమయానికి నడవడం వల్ల ప్రయాణాలు సౌకర్యవంతంగా మారడంతో పాటు, కనెక్టింగ్ రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలను కూడా ప్రయాణికులు సులభంగా అందుకోగలుగుతారు. దీంతో రైల్వేపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనకియా అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ప్రతి ఉద్యోగి క్రమశిక్షణతో పని చేయడం, పరస్పర సహకారం, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ఒకటైన విజయవాడ డివిజన్‌లో ఇలాంటి సమయపాలన సాధించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయి పనితీరును కొనసాగిస్తూ ప్రయాణికులకు మరింత సురక్షితమైన, నమ్మకమైన, సమయపాలనతో కూడిన సేవలను అందించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.
Read Also: పట్టాలెక్కబోతున్న ఫస్ట్ ఇండియన్ హైడ్రోజన్ ట్రైన్.. టికెట్ ధర జస్ట్ 5 రూపాయలే!