India’s First Hydrogen Train Launched: పర్యావరణహితమైన రవాణా వ్యవస్థల వైపు భారత్ మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్ – సోనిపట్ మార్గంలో సర్వీసులు అందిస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ భారత రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే ప్రయాణికుల రైలును అందుబాటులోకి తీసుకొచ్చిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.
ఈ రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కనీస టికెట్ ధర రూ.5 నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణించే దూరాన్ని బట్టి గరిష్టంగా రూ.25 వరకు ఉంటుంది. ప్రారంభ రోజునే పలువురు ప్రయాణికులు రూ.5 టికెట్‌తో ఈ ప్రత్యేక రైలులో ప్రయాణించారు.
ఈ హైడ్రోజన్ రైలు ప్రస్తుతం హర్యానాలోని జింద్ జంక్షన్ నుంచి సోనిపట్ వరకు నడుస్తోంది. మధ్యలో జింద్ సిటీ, పాండు పిండారా, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఇసాపూర్ ఖేరి, బుటానా, ఖండ్రాయ్, రాబ్రా, లాత్, మోహనా, బర్వాస్ని లాంటి పలు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు ప్రస్తుతం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీని గరిష్ట వేగం 110 కిలోమీటర్లు.
సాధారణంగా రైళ్లు డీజిల్, విద్యుత్‌తో నడుస్తాయి. కానీ, ఈ కొత్త రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్‌తో రసాయన చర్య జరిపి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో కాలుష్యకారక వాయువులు వెలువడవు. కేవలం నీటి ఆవిరి, కొంత వేడి మాత్రమే విడుదలవుతాయి. మొత్తంగా ఇదో పర్యావరణహిత రవాణా వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉన్నాయి. రెండు హైడ్రోజన్ పవర్ కార్లు, ఎనిమిది ప్రయాణికుల కోచ్ లతో రూపొందించారు. ఇందులో 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్ అమర్చారు. ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంది. భద్రతకు కూడా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. హైడ్రోజన్ లీకేజీ, పొగ, మంటలు, అధిక ఉష్ణోగ్రతలను వెంటనే గుర్తించే ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా జింద్ లో దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 3,000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హైడ్రోజన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా లాంటి దేశాల సరసన భారత్ కూడా చేరింది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో ఇలాంటి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: నీటితో నడిచే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి.. ఈ రైలు ప్రత్యేకతలు ఇవే