Indian Railways: భారతీయ రైల్వే వ్యవస్థ రోజు రోజుకు మరింతగా అభివృద్ధి చెందుతున్నది. గతంలో కేవలం భూమి మీదే రైల్వే ట్రాక్ లు నిర్మించి.. రైలు సేవలు కొనసాగించగా, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిల మీదుగా.. నదీ గర్భం లోపలా రైళ్లు దూసుకెళ్లేలా అద్భుతాలను సృష్టిస్తున్నది. 2024లో భారతీయ రైల్వేలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అయ్యాయి. వాటిలో ఒకటి అండర్ వాటర్ మెట్రో రైలు. ఈ ఇంజినీరింగ్ అద్భుతానికి కోల్ కతా వేదికైంది. దేశంలోనే తొలిసారి బెంగాల్ లోని హుగ్లీ నది లోపల నిర్మించిన టన్నెల్లో మెట్రో పరుగులు తీస్తూ ప్రయాణీకులను అబ్బుర పరిచింది. ప్రధాని మోడీ మార్చి 6, 2024న ఈ మెట్రో సేవలను ప్రారంభించారు.
అండర్ వాటర్ మెట్రోలో ప్రత్యేకతలు ఎన్నో!
⦿ హుగ్లీ నది గర్భంలో నిర్మించిన ఈ మెట్రో ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ టన్నెల్ నిర్మించడానికి పూర్తి స్థాయిలో స్టెయిన్ లెస్ స్టీల్ ను వినియోగించారు. నది దిగువన టన్నెల్ ను రూపొందించడానికి ఎర్త్ ప్రెషర్ బ్యాలెన్స్ టన్నెల్ యంత్రాలను ఉపయోగించారు.
⦿ దేశంలో నీటి అడుగున నడిచే మెట్రోను ప్రపంచ స్థాయి సాంకేతికతను ఉపయోగించి నిర్మించారు. నీటి అడుగున మెట్రో ప్రయాణీకులకు 5G ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందుతారు.
⦿ హుగ్లీ నదికి దిగువన సొరంగం నిర్మించారు. అయినప్పటికీ రైల్లోకి ఒక్క చుక్క నీరు కూడా ప్రవేశించదు.
⦿ హౌరా మెట్రో స్టేషన్ భూమికి 33 మీటర్ల దిగువన నిర్మించబడింది. ఈ మెట్రో మార్గంలో 12 స్టేషన్లు ఉన్నాయి, వాటిలో మూడు నీటి అడుగు భాగంలోనే ఉన్నాయి.
⦿ కోల్‌కతా నీటి అడుగున నడిచే మెట్రో నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.4,965 కోట్లు కేటాయించారు.
⦿ ఈ మార్గం హుగ్లీ నది అడుగున భాగంలో ఏకంగా 4.8 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ దూరాన్ని చేరుకోవడానికి రైలుకు కేవలం 45 సెకన్లు పడుతుంది.
⦿ ఈ ప్రత్యేక మెట్రో లైన్ లో కొంత భాగం హుగ్లీ నది కింద ఉంటుంది. ఇది కోల్ కతా మెట్రో కు సంబంధించి ఎస్ప్లానేడ్ లైన్ లో ఒక భాగం. ఈ మెట్రో రైలు హౌరా, సాల్ట్ లేక్ సిటీని కలుపుతుంది. ఇది హుగ్లీ నదికి ఇరువైపులా ఉంది. దీని పూర్తి పొడవు 16.5 కి.మీ.
Read Also: దేశంలో ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా వెళ్లే రైలు.. ఎక్కడా ఆగే ముచ్చటే లేదు!
⦿ దేశంలోనే నీటి అడుగున నడిచే తొలి మెట్రోను గత ఏడాది(2024) ఏడాది మార్చి 6న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
⦿ ఇక ఈ ప్రతిష్టాత్మక ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ నిర్మాణ ప్రణాళికలు ఫిబ్రవరి 2009 నుంచి మొదలయ్యాయి. అండర్ వాటర్ టన్నెల్ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ఈ మెట్రో మార్గాన్ని ప్రకృతి విపత్తుల నుంచి తట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీతో పాటు లండన్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థల సాకారంతో రూపొందించారు.
Read Also: వందే భారత్‌లో కశ్మీర్‌కు వెళ్లాలా? ఇవిగో ట్రైన్ టైమింగ్స్.. వెంటనే బుక్ చేసేసుకోండి!