Oppo Reno 17 Series: స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా, బ్యాటరీ, పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చేవారి కోసం ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో.. Reno 17 సిరీస్‌ను తీసుకొస్తోంది. నవంబర్‌లో చైనాలో లాంచ్ కానున్న ఈ సిరీస్‌లో ‘Reno 17 Pro కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రో మోడల్లో 200MP మెయిన్ కెమెరా, 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చనే లీకులు టెక్ వర్గాల్లో ఆసక్తి పెంచుతున్నాయి. మరోవైపు, Oppo Pad Air 6 ట్యాబ్లెట్, Oppo Watch 5ను కూడా పరిచయం చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాలో Reno 17 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. మరి ఈ ఫోన్లలో ఎలాంటి స్పెసిఫికేషన్లు ఉండొచ్చు? భారత్‌లో ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? వంటి వివరాలు తెలుసుకుందాం.
Oppo Reno 17 సిరీస్ కోసం చైనాలో ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. నవంబర్‌లో ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ వీబో పోస్ట్ ద్వారా తెలిపింది. ముందుగానే ఆర్డర్ చేసే కస్టమర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్‌లు కూడా అందించే అవకాశం ఉంది. అయితే, లాంచ్ తేదీ, ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. టీజర్లో ఫోన్ ముందు భాగం కనిపిస్తోంది. కర్వ్డ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, గుండ్రని మూలలతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది.
Reno 17 సిరీస్‌తో పాటు Oppo Pad Air 6, Oppo Watch 5 కూడా త్వరలో పరిచయం కావచ్చని తెలుస్తోంది. కంపెనీ చైనా వెబ్సైట్లో ఈ రెండు డివైజ్‌ల పేర్లు కనిపించడంతో వాటి లాంచ్‌పై ఆసక్తి పెరిగింది. అయితే, వీటి ఫీచర్లు, ధరలు, విడుదల తేదీలపై ఇంకా స్పష్టత లేదు.
Also Read: టెక్ ప్రపంచంలో ఊహకందని అద్భుతం.. శాంసంగ్ నుంచి 17 ఇంచుల ట్యాబ్లెట్, జేబులో పట్టేస్తుంది!
తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. Reno 17 Proలో 6.32 అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్ప్లే ఉండొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8550 చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. వెనుకవైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండొచ్చు. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, మెటల్ ఫ్రేమ్, IP69 రేటింగ్ కూడా ఇందులో ఉండొచ్చని అంచనా.
భారత్‌లోకి Reno 17, Reno 17c మోడళ్లు మాత్రమే రావచ్చని టిప్‌స్టర్ వెల్లడించారు. వీటిలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4, డైమెన్సిటీ 7300 చిప్సెట్లు ఉండొచ్చని సమాచారం. Reno 17 5G ఫోన్ థాయ్‌లాండ్ NBTC వెబ్సైట్లో CPH2975 మోడల్ నంబర్‌తో కనిపించింది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ఓఎస్ 17తో ఈ సిరీస్ వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఫోన్లు 2027 జనవరి ప్రారంభంలో విడుదల కావచ్చని అంచనా. అయితే, ఈ వివరాలన్నీ అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
Also Read: మనలాగే మాట్లాడే ఈ ‘పర్సనల్ ఏఐ అవతార్’ గురించి తెలుసా? గూగుల్ జెమిని కొత్త ఫీచర్ ఇదే!