విశాఖపట్నంలో ఏపీ సర్కారు అత్యాధునిక మెట్రో వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధిచి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విశాఖ మెట్రో ఫేజ్ 1లో భాగంగా మొత్తం 46.23 కి.మీ. దూరాన్ని కవర్ చేసేలా నిర్మించబోతున్నట్లు ఏపీ మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఫేజ్ 1కు సంబంధించిన నిర్మాణ పనులు అక్టోబర్ 2025 నుంచి మొదలవుతాయన్నారు. ఈ దశను రెండు భాగాలుగా విభజించారు. 20 కి.మీ. డబుల్ డెక్కర్ మెట్రో వ్యవస్థతో పాటు 26 కి.మీ. ప్రామాణిక మెట్రో కారిడార్ ను నిర్మించనున్నారు.
రెండు స్ట్రెచ్‌లుగా డబుల్ డెక్కర్ వ్యవస్థ
వైజాగ్ మెట్రో కోసం నిర్మించే 20 కి.మీ డబుల్ డెక్కర్ వ్యవస్థను రెండు స్ట్రెచ్‌లుగా విభజించారు. వాటిలో ఒకటి కార్షెడ్ జంక్షన్ (పిఎం పాలెం) నుంచి తాటిచెట్లపాలెం వరకు ఒక 15 కి.మీ మార్గం కాగా రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంట్రెన్స్ నుంచి నుంచి గాజువాక వరకు మరొక 5 కి.మీ మార్గం ఉంటుంది. ఇది దేశంలోనే అతి పొడవైన డబుల్ డెక్కర్ మెట్రో మార్గంగా గుర్తింపు తెచ్చుకోబోతోంది.
డబుల్ డెక్కర్ వ్యవస్థతో లాభం ఏంటి?
డబుల్ డెక్కర్ వ్యవస్థతో రెండు రవాణా అవసరాలు తీరుతాయి. మొదటి ఫ్లై ఓవర్ లో వాహనాలు నడుస్తాయి. రెండో ఫ్లై ఓవర్ లో మెట్రో రైలు నడుస్తుంది. రెండింటికీ ఒకే సెట్ ఫిర్లర్ సపోర్టు ఉంటుంది. డబుల్ డెక్కర్ విభాగానికి అదనంగా రూ. 2,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. ఈ డబుల్-డెక్కర్ వ్యవస్థ స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడమే కాకుండా భూసేకరణ అవసరాలను గణనీయంగా తగ్గిస్తుంది. వైజాగ్ మెట్రోను సుమారు రూ. 11,498 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు.
దేశంలో డబుల్ డెక్కర్ మెట్రో వ్యవస్థలు
⦿ నాగ్‌పూర్ మెట్రో: మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో 3.14 కిలో మీటర్ల పరిధిలో డబుల్ డెక్కర్ మెట్రో వ్యవస్థ ఉంటుంది. మెట్రో వార్ధా రోడ్ వెంబడి ఈ నిర్మాణం ఉంటుంది. ఇది మూడు అంతస్తులలో ఉంది. పై స్థాయిలో మెట్రో రైలు, మధ్యలో హైవే ఫ్లైఓవర్ , గ్రౌండ్ లెవెల్‌లో రహదారి ఉన్నాయి.
⦿ చెన్నై మెట్రో: చెన్నై మెట్రో రైలు రెండో దశలో భాగంగా 3.75 కి.మీ డబుల్ డెక్కర్ కారిడార్ ను నిర్మించారు. ఈ కారిడార్, ఆర్కాట్ రోడ్డు వెంట అల్వర్తిరునగర్ నుంచి అలపాక్కం వరకు విస్తరించి ఉంది. ఇందులో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. అల్వర్తిరునగర్, వలసరవక్కం, కరంబక్కం, అలపాక్కం.
⦿ ఢిల్లీ మెట్రో: ఫేజ్ 4లో భాగంగా మూడు డబుల్ డెక్కర్ వయాడక్ట్‌లను నిర్మిస్తోంది. ఎగువ డెక్‌పై మెట్రో రైలు, దిగువ డెక్‌పై వాహనాలు వెళ్లే ఫ్లై ఓవర్ ను ఏర్పాటు చేశారు. ఏరోసిటీ-తుగ్లకాబాద్ కారిడార్‌లోని సంగం విహార్, అంబేద్కర్ నగర్ మధ్య 2.4 కి.మీ వయాడక్ట్, జనక్ పురి వెస్ట్- ఆర్‌కె ఆశ్రమ మార్గ్ కారిడార్‌లోని ఆజాద్‌పూర్- రాణి ఝాన్సీ రోడ్ మధ్య 2.2 కి.మీ వయాడక్ట్, మజ్లిస్ పార్క్-మౌజ్‌పూర్ కారిడార్‌లోని భజన్‌పురా- యమునా విహార్ మధ్య 1.4 కి.మీ వయాడక్ట్ ఉన్నాయి.
⦿ విజయవాడ మెట్రో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ (66 కి.మీ)కు డబుల్ డెక్కర్ మెట్రో వ్యవస్థను ఆమోదించింది. విజయవాడలో, రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ డబుల్ డెక్కర్ విభాగం ప్రణాళిక చేయబడింది. ఈ వ్యవస్థలలో బేస్ దగ్గర రోడ్లు, మధ్యలో ఫ్లైఓవర్లు, పైన మెట్రో లైన్లు ఉంటాయి.
⦿ హైదరాబాద్ మెట్రో: హైదరాబాద్ మెట్రో పరిధిలోని మియాపూర్-పటాన్‌చెరు కారిడార్‌లోని మదీనాగూడ దగ్గర 1.2 కి.మీ డబుల్-డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నిర్మాణంలో దిగువ స్థాయిలో హైవే, పైన మెట్రో వయాడక్ట్ ఉంటాయి.
⦿ బెంగళూరు మెట్రో: బెంగళూరు మెట్రో ఫేజ్ 3 విస్తరణలో భాగంగా డబుల్-డెక్కర్ మెట్రో లైన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది.
Read Also: విశాఖలో ఆ ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన పోలీసులు!