అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖకు రానున్నారు. వైజాగ్ లక్షల మందితో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జూన్ 17 ఉదయం 10 గంటల నుంచి జూన్ 21 ఉదయం 10 గంటల వరకు నాలుగు రోజుల పాటు విశాఖపట్నంను తాత్కాలిక రెడ్ జోన్ గా ప్రకటించినట్లు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. మొత్తం 5 కిలో మీటర్ల పరిధిలో డ్రోన్‌లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యోగా డే వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు
ఈ నెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఆయూష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడించారు. తాజాగా ఆయన విశాఖలో పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడిన ఆయన, అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉదయం 5:30 గంటల నుంచి ప్రజలకు యోగా వేదికకు చేరుకునేందుకు అనుమతి ఉంటుందన్నారు. ప్రధాని మోడీ ఉదయం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు యోగా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రధాని ప్రసంగం తరువాత కార్యక్రమం అయిపోతుందన్నారు.
5 లక్షల మందితో యోగా వేడుకలు
విశాఖలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. ఐదు లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో యోగా దినోత్సవం కార్యక్రమాలు జరగబోతున్నట్లు తెలిపారు.
Read Also: భాగ్యనగరంలో అద్భుతం, దేశంలోనే అతి పెద్ద టన్నెల్ అక్వేరియం!
విశాఖ యోగా డే వేడుకల్లో 40 దేశాల ప్రతినిధులు
విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమంలో పలు దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. మొత్తం 40 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరవుతారని వెల్లడించారు. 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం ఉంటుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వివరించారు.
Read Also: మచిలీపట్నం బీచ్‌లో హెలికాప్టర్ రైడ్.. జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు!