Kolkata Airport: కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపైకి అకస్మాత్తుగా ఓ వీధి కుక్క రావడం తీవ్ర కలకలం రేపింది. ఆ సమయంలో ఓ విమానం టేకాఫ్ సిద్ధమవుతుండగా, మరొకటి ల్యాండింగ్‌కు రెడీ అయ్యింది. గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే నిర్ణయం మార్చుకున్నారు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?
కోల్‌కత్తా ఎయిర్‌పోర్టు అధికారుల వివరాల మేరకు.. కోల్‌కతా నుంచి రాంచీ వెళ్తోంది ఇండిగో విమానం. ఆ విమానం రన్‌వేపై టేకాఫ్‌కు రెడీ అవుతోంది. విమానం రన్‌వేపైకి రాగానే టేకాఫ్‌కు కొద్దిక్షణాల ముందు ఒక్కసారిగా రన్‌వేపై వీధి కుక్క వేగంగా దూసుకుంటూ వచ్చింది. రన్ వే పై శునకం తిరడాన్ని గమనించాడు పైలట్. ఒకవేళ వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించాడు. వెంటనే ఏటీసీ అధికారులను అప్రమత్తం చేశాడు.
అదే సమయంలో చెన్నై నుంచి కోల్‌కతాకు మరొక ఇండిగో విమానం ల్యాండింగ్ కావాల్సివుంది. రన్‌వే పై కుక్క ఉందన్న సమాచారంతో ఏటీసీ అప్రమత్తమైంది. ఫలితంగా మరొక ఇండిగో విమానాన్ని ల్యాండింగ్‌కు నిరాకరించారు అధికారులు. ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి వెళ్లాలని సూచించారు. ఏటీసీ ఆదేశాలతో చెన్నై- కోల్‌కతా ఇండిగో విమానం 187 కిలోమీటర్ల దూరంలో ఉన్న అండాల్ ఎయిర్ పోర్టుకు వెళ్లి, అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
సాయంత్రం 6.35 గంటలకు ల్యాండ్ అయ్యింది. ఎయిర్‌పోర్టులో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత రాత్రి సుమారు 10 గంటలకు కోల్‌కతాకు తిరిగి వచ్చింది ఇండిగో విమానం. పైలట్లు, ఏటీసీ అధికారులు సకాలంలో స్పందించడంతో రెండు విమానాలకు ప్రమాదకరమైన పరిస్థితి తప్పింది. దీంతో రెండు ఇండిగో విమానాల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ భద్రతపై అనుమానాలకు మొదలయ్యాయి.
ALSO READ: లోకల్ ట్రైన్‌లో ఘోరం.. యువతిని వేధించి కిందికి తోసేసిన కీచకుడు.. చేయి కోల్పోయిన బాధితురాలు!
సురక్షిత ప్రాంతమైన రన్‌వేపైకి కుక్క ఎలా ప్రవేశించింది అనేదానిపై విచారణ చేపట్టారు అధికారులు. ఈ సంఘటన విమానాశ్రయ కార్యకలాపాల ప్రాంతాల్లోకి వన్యప్రాణులు, వీధి జంతువుల చొరబాటు సమస్యపై చర్చ మొదలైంది. రద్దీగా ఉండే రన్‌వేపై చిన్న జంతువులు విమానాలకు గణనీయమైన ముప్పును కలిగించగలవు. టేకాఫ్-ల్యాండింగ్ సమయాల్లో పైలట్‌లకు దిద్దుబాటుకు పరిమితమైన స్థలం ఉంటుంది.