IRCTC Special Nepal Yatra: భారతీయ రైల్వే ప్రయాణికులకు మరో అద్భుతమైన టూర్ ప్లాన్ పరిచయం చేసింది. సమ్మర్ లో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలంగా ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భారత్ నుంచి తొలిసారి నేపాల్ కు భారత్ గౌరవ్ పర్యాటక రైలు సేవను ప్రారంభించనున్నట్లు IRCTC ప్రకటించింది. పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర పేరుతో ఈ ప్రత్యేక టూర్ తీసుకొచ్చింది. జూన్ 12న ఇండోర్ నుంచి ప్రారంభం కానుంది. నేపాల్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శించుకోవడంతో పాటు ప్రకృతి అందాలు ఆస్వాదిండం, అడ్వెంచర్ల ఎక్స్ పీరియెన్స్ చేయడం లాంటివి ఒకే యాత్రలో కొనసాగించేలా ప్యాకేజీని రూపొందించారు.
నేపాల్ యాత్ర మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు కొనసాగుతుంది. సాధారణ రైలు ప్రయాణం మాత్రమే కాకుండా, ప్రయాణికులకు పూర్తి టూర్ ఎక్స్ పీరియెన్స్ ను అందించేలా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణంతో పాటు హోటల్ బస, భోజనం, బస్సు సర్వీసులు, స్థానిక ప్రాంతాల సందర్శన సౌకర్యాలన్నీ ఈ ప్యాకేజీలోనే ఉంటాయి. వేరుగా హోటల్, ట్రావెల్ బుకింగ్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
ఈ టూర్ లో ప్రధాన ఆకర్షణగా కాఠ్మండులోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయ దర్శనం ఉంటుంది. హిందువులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా భావించే ఈ ఆలయాన్ని సందర్శించే అవకాశం భక్తులకు కల్పించనున్నారు. అలాగే, కాఠ్మండులోని చారిత్రక ప్రాంతాలు, పురాతన దేవాలయాలను కూడా చూపించనున్నారు.
ఇక ప్రకృతి ప్రేమికుల కోసం పోఖారా పర్యటనను కూడా ఈ యాత్రలో చేర్చారు. సరస్సులు, పర్వతాల మధ్య ఉన్న పోఖారా నగరం నేపాల్ లో అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడి ప్రకృతి అందాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. అదేవిధంగా చిత్వాన్ నేషనల్ పార్క్ లో జీప్ సఫారీ కూడా ఏర్పాటు చేశారు. అడవి జంతువులను దగ్గరగా చూసే అవకాశం ఈ సఫారీ ద్వారా లభిస్తుంది.
మనకామన ఆలయానికి రోప్ వే ప్రయాణం కూడా ఈ టూర్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. పర్వతాల మధ్య సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. డివోషనల్, అడ్వెంచర్, ప్రకృతి అందాలు అన్నీ కలిసిన ఈ టూర్ ప్రత్యేకంగా ఉండనుంది.
మధ్యప్రదేశ్‌లోని పలు స్టేషన్ల నుంచి ప్రయాణికులు ఈ రైలును ఎక్కవచ్చు. ఇండోర్, ఉజ్జయిన్, భోపాల్, జబల్‌పూర్, సత్నా లాంటి ప్రధాన స్టేషన్లలో బోర్డింగ్ సౌకర్యం కల్పించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే రెండు ప్రత్యేక రెస్టారెంట్ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణం మొత్తం శాకాహార భోజనం అందించనున్నారు.
ప్యాకేజీ ధర ఎంత అంటే?
ఈ టూర్ ప్యాకేజీ ధరలు కూడా కేటగిరీల ఆధారంగా ఉంటాయి. థర్డ్ ఏసీ ప్యాకేజీ ధర సుమారు రూ.62 వేలుగా ఉంది. సెకండ్ ఏసీ ధర రూ.76 వేల వరకు ఉండగా, ఫస్ట్ ఏసీ ప్యాకేజీ ధర సుమారు రూ.90 వేలుగా నిర్ణయించారు. ఈ మొత్తంలో రైలు ప్రయాణం, 3 స్టార్ హోటల్ వసతి, భోజనం, ఏసీ బస్సులో లోకల్ టూర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, భద్రత, టూర్ గైడ్ లాంటి సర్వీసులు ఉంటాయి. ఈ ప్రత్యేక యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ సదుపాయం IRCTC టూరిజం వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
Read Also: ఫస్ట్ ఇండియన్ బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ రిలీజ్.. చూడ్డానికి భలే ఉంది భయ్యా!