IRCTC Jyotirlinga Tour Package: వేసవి సెలవుల్లో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్‌సిటిసి అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఒకేసారి 7 జ్యోతిర్లింగాలను దర్శించే ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్ర జూన్ 12న ప్రారంభమై జూన్ 23 వరకు కొనసాగనుంది. మొత్తం 11 రాత్రులు, 12 రోజుల పాటు సాగే ఈ పుణ్యయాత్రలో ప్రసిద్ధ శైవక్షేత్రాలు, ఆలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేక యాత్ర రిషికేశ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. యోగా నగరంగా పేరపొందిన రిషికేశ్ నుంచి బయలుదేరే భారత్ గౌరవ్ రైలు, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ప్రముఖ జ్యోతిర్లింగాలు, పవిత్ర ఆలయాలకు భక్తులను తీసుకెళ్తుంది.
ఈ యాత్రలో భక్తులు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించనున్నారు. అలాగే గుజరాత్‌లోని ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ప్రసిద్ధ సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా సందర్శిస్తారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, భీమాశంకర్ జ్యోతిర్లింగం, గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. వీటితో పాటు పంచవటి, కాలారామ్ ఆలయం లాంటి పలు పవిత్ర ప్రాంతాలను కూడా యాత్రికులు దర్శించుకుంటారు.
ఈ రైలులో ప్రయాణించే వారికి పలు స్టేషన్ల నుంచి ఎక్కే అవకాశం కల్పించారు. రిషికేశ్ తో పాటు హరిద్వార్, మొరాదాబాద్, బరేలీ, షాజహాన్ పూర్, హర్దోయ్, లక్నో, కాన్పూర్, ఓరై, వీరాంగన లక్ష్మీబాయి జంక్షన్, లలిత్ పూర్ లాంటి స్టేషన్లలో కూడా ప్రయాణికులు ఎక్కవచ్చు.
భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సిటిసి మూడు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎకానమీ క్లాస్‌లో స్లీపర్ కోచ్ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.24,100గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ 3ఏసీ ప్యాకేజీ ధర రూ.40,890గా ఉంది. ఇక కంఫర్ట్ క్లాస్ 2ఏసీ కోసం ఒక్కొక్కరు రూ.54,390 చెల్లించాలి. ఈ మొత్తం చార్జీలో రైలు ప్రయాణంతో పాటు వసతి, భోజన సదుపాయాలు కూడా ఉంటాయని ఐఆర్‌సిటిసి తెలిపింది.
ఈ యాత్రకు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ విధానంలో సీట్లు కేటాయిస్తామని ఐఆర్‌సిటిసి అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు లక్నోలోని ఐఆర్‌సిటిసి కార్యాలయంలో నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే, ఆన్‌లైన్ ద్వారా కూడా సులభంగా టికెట్లు రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒకేసారి పలు జ్యోతిర్లింగాలను దర్శించాలనుకునే భక్తులకు ఈ టూర్ మంచి అవకాశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి ఈ ప్రత్యేక భారత్ గౌరవ్ రైలు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.
Read Also: బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైల్ రూట్ ఫిక్స్, స్టేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే?