63 Year Old Granny Train Returns: పాత రైలు అంటే సాధారణంగా మ్యూజియంలోనో, రైల్వే యార్డులోనో కనిపిస్తుంది. కానీ పోలాండ్ లో మాత్రం 63 ఏళ్ల ఓ రైలు ఇప్పటికీ ప్రయాణికులను తీసుకెళ్తోంది. ముద్దుగా ‘బాబ్సియా’ అని పిలిచే ఈ ఎలక్ట్రిక్ రైలు.. అంటే పోలిష్ భాషలో ‘గ్రానీ’ అని అర్థం. తాజాగా మళ్లీ అప్ డేట్ అయిన ఈ రైలు మరోసారి పట్టాలపైకి వచ్చేందుకు సిద్ధమైంది.
బాబ్సియా అసలు పేరు EN57-038. ఇది 9 మే 1963న పోలాండ్ లోని వ్రోక్లా నగరంలోని పఫావాగ్ ఫ్యాక్టరీలో తయారైంది. అప్పట్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ దేశంలో రైలు బోగీలు, లోకోమోటివ్‌ల తయారీలో కీలక పాత్ర పోషించింది. ఈ రైలు ఎన్నో దశాబ్దాల పాటు సౌత్ మలోపోల్స్ ప్రాంతంలో సేవలు అందించింది. క్రాకోవ్, టార్నోవ్, నోవీ సాక్జ్, సుచా బెస్కిడ్జ్కా లాంటి ప్రాంతాల నడిచింది.
2003లో బాబ్సియాను మసోవియా ప్రాంతానికి తరలించారు. అప్పటి నుంచి వార్సా చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది. పాత రైలు అయినప్పటికీ నిర్వహణ, ఆధునీకరణ పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నారు. 2022లో దీనికి మరో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పఫావాగ్ ఫ్యాక్టరీలో తయారైనప్పుడు ఉన్న పసుపు, నీలం రంగులను తిరిగి తీసుకొచ్చారు. దీంతో రైలు పాతకాలపు లుక్ ను మళ్లీ సొంతం చేసుకుంది.
తాజా అప్ డేట్ తర్వాత రైలులో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. మానిటరింగ్ వ్యవస్థను మెరుగుపరిచారు. టాయిలెట్‌ను కూడా అప్ డేట్ చేశారు. ఇప్పుడు ఇందులో క్లోజ్డ్ సర్క్యులేషన్ టాయిలెట్ వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే వ్యర్థాలు నేరుగా రైల్వే పట్టాలపై పడకుండా మేనేజ్ చేస్తారు.
అప్ డేట్ పూర్తైన తర్వాత బాబ్సియా వీకెండ్ లో స్పెషల్ సర్వీసుగా నడవనుంది. వార్సాకు ఈశాన్యంగా ఉన్న త్లూష్చ్ నుంచి మోస్టోవ్కా వరకు దాదాపు 10 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇది కేవలం సాధారణ రైలు ప్రయాణం మాత్రమే కాదు. పాత రైళ్లను ఇష్టపడేవారికి, రైల్వే చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేక అనుభూతిని అందించనుంది.
పోలాండ్‌లో ప్రస్తుతం రైలు ప్రయాణాలకు ఆదరణ పెరుగుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో దేశంలోని రైలు ఆపరేటర్ PKP ఇంటర్ సిటీలో 44.7 మిలియన్ల మంది ప్రయాణించారు. అదే సమయంలో దేశం హైస్పీడ్ రైలు నెట్ వర్క్ ను విస్తరించే పనుల్లోనూ వేగం పెరిగింది. అయితే, వేగంగా దూసుకెళ్లే ఆధునిక రైళ్లతో పాటు పాత రైళ్లపై కూడా ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. అందుకే పాత రైళ్లతో ప్రత్యేక ‘స్లో’ సర్వీసులను కూడా ప్రారంభిస్తున్నారు. కాలం మారినా.. కొన్ని రైళ్లపై ఉండే జ్ఞాపకాలు మాత్రం మారవు. గ్రానీ మళ్లీ పట్టాలెక్కడం ఇందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు.
Read Also: అడవిలో దాగిన 1,500 ఏళ్ల అద్భుతం.. తెలంగాణ ఆంగ్‌కోర్ వాట్ ఆలయం గురించి మీకు తెలుసా?