IRCTC Super App: ప్రస్తుతం రైల్వే సేవలు పొందడానికి చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సర్వీసు కోసం ఒక్కో యాప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇకపై అన్ని సేవలను ఒకే చోట పొందేలా రైల్వే సంస్థ సరికొత్త యాప్ ను రూపొందిస్తున్నది. సూపర్ యాప్ గా పిలిచే ఈ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడంతో పాటు రైళ్లను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. చివరకు ఫిర్యాదులు కూడా ఈ యాప్ నుంచే చెయ్యొచ్చు. తాజాగా ఈ యాప్ కు సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో వివరించారు. రైలు సేవల కోసం ఈ సూపర్ యాప్ ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
సూపర్ యాప్ గురించి రైల్వే మంత్రి ఏమన్నారంటే?
“రైల్వేకు సంబంధించి సేవలు ప్రస్తుతం చాలా రకాల యాప్స్ ద్వారా కొనసాగుతున్నాయి. ఇకపై అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసురావాలని భావిస్తున్నాం. అందులో భాగంగానే అన్ని రైల్వే సేవలు ఒకే చోట పొందేలా సూపర్ యాప్ ను రూపొందిస్తున్నాం. ప్రయాణీకులు టికెట్ల రిజర్వేషన్ నుంచి మొదలుకొని, రైళ్ల తనిఖీ, రైలు ట్రాకింగ్, టికెట్ల క్యాన్సిలేషన్ సహా ఫిర్యాదులను కూడా చేసేలా రూపొందిస్తున్నాం. రైల్వే అందించే అన్ని సేవలు ఈ యాప్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది” అని రైల్వే మంత్రి వివరించారు.
IRCTC సూపర్ యాప్ ఫీచర్లు
ప్రస్తుతం రైల్వే సేవలకు వినియోగిస్తున్న అన్ని యాప్ లకు సంబంధించిన సేవలు ఇకపై సూపర్ యాప్ పరిధిలోకి రానున్నాయి. ప్లాట్ ఫారమ్ టికెట్లను కొనుగోలు చేయడం, రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేయడం, రైళ్లను ట్రాక్ చేయడం, ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్, ఫుడ్ సర్వీసు వివరాలను ఇందులో ఉంటాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే Rail Madad, UTS, IRCTC రైల్ కనెక్ట్ తో సహా అనేక యాప్ లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
సూపర్ యాప్ ను రూపొందిస్తున్న CRIS
ఇండియన్ రైల్వే సూపర్ యాప్ ను CRIS సంస్థ రూపొందిస్తున్నది. ఈ యాప్ ఈ నెల చివర్లో లేదంటే వచ్చే నెలలో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ యాప్ ద్వారా ఇకపై ఈజీగా రైల్వే సేవలను పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులకు సమర్థవంతంగా డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో CRIS సంస్థ ఈ యాప్ ను రూపొందిస్తున్నది.
Read Also:స్టేషన్‌లో ఆగకుండా వెళ్లి, రివర్స్ లో వెనకొచ్చిన రైలు, సీన్ కట్ చేస్తే..
సూపర్ యాప్ ను ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
ఇకపై లక్షలాది మంది ఈ ఫ్లాట్ ఫారమ్ మీదుగా రైల్వే సేవలను పొందనున్నారు. ఈ యాప్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని రైల్వే ప్రయాణీకులు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక యాప్ ను ప్రధాని మోడీ, వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన రోజునే ఆవిష్కరించనున్నట్లు తెలుస్తున్నది.
Read Also: ఇండియన్ రైల్వేలో హిస్టారికల్ మైల్ స్టోన్.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లింక్ చివరి ట్రాక్ కంప్లీట్!