Indian Railway: బస్సులు కొన్నిసార్లు ప్రయాణీకులు చెయ్యెత్తినా ఆపకుండా వెళ్తుంటాయి. బస్సులో ఎక్కువ మంది ఉండటం, లేదంటే స్టాఫ్ లేకపోవడం కారణంగా బస్సులు ఆగకుండా పోతాయి. ఆర్టీసీ అధికారులు ఇలాంటి ఘటనలపై పెద్దగా స్పందించరు. కానీ, రైలు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. పలానా రూట్లో ఓ రైలు వెళ్తుందంటే, ఆ రైలు ఎన్ని స్టేషన్లలో ఆగాలి? ఎంతసేపు ఆగాలి? అనే విషయంపై పూర్తి క్లారిటీ ఉంటుంది. బస్సు డ్రైవర్ మాదిరిగా లోకో పైలెట్ నచ్చిన స్టేషన్ లో రైలును ఆపుతాను అంటే అస్సలు కుదరదు. కానీ, ఓ రైలు డ్రైవర్ మర్చిపోయి ఓ స్టేషన్ లో ఆపకుండా వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక గుర్తొచ్చి, రివర్స్ లో వెనక్కి తీసుకొచ్చాడు. ఈ ఘటనపై సీరియస్ అయిన రైల్వే అధికారులు సదరు లోకో పైలెట్ పై వేటు వేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
లోకో పైలెట్ పై సస్పెన్షన్ వేటు
తమిళనాడులోని తిరునల్వేలి నుంచి తిరుచెందూర్ వెళ్లే తిరుచెందూర్ – పాలక్కాడ్ ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 13న పొద్దున 7.50 గంటలకు శ్రీవైకుంఠం సమీపంలోని తాతన్ కుళం రైల్వే స్టేషన్ మీదుగా తిరుచెందూర్ వెళుతోంది. వాస్తవానికి తాతన్ కుళం రైల్వే స్టేషన్ లో సదరు రైలు ఆగాలి. ఇక్కడ దిగేవాళ్లు, ఈ స్టేషన్ లో రైలు ఎక్కే ప్రయాణీకులు కూడా ఉన్నారు. కానీ, సదరు లోకో పైలట్ రమేష్ కుమార్, మేనేజర్ మహారాజన్ రైలు ఆపకుండా ముందుకు వెళ్లిపోయారు. స్టేషన్ లోని ప్రయాణీకులు షాక్ అయ్యారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత లోకో పైలెట్ ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే రైలును ఆపారు. రైలును మెల్లగా వెనక్కి తీసుకొచ్చారు. రైలు వెనక్కి వస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే సదరు లోకో పైలెట్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
నిబంధనలకు విరుద్దంగా రివర్స్ లో వెనక్కి..
రైలు రివర్స్ లో వెనక్కి రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. “రైలు రివర్స్ డైరెక్షన్ లో వెనక్కి తీసుకురావాల్సి వస్తే, ప్రామాణిక భద్రతా పద్దతులను పాటించాలి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెనుకవైపు తగిన పర్యవేక్షణ ఉన్న సమయంలోనే రైలును రివర్స్ తీయాల్సి ఉంటుంది. రైల్వే ట్రాక్ పై ఉన్న వ్యక్తుల కదలికలను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే రైలును రివర్స్ డైరెక్షన్ లో నడపాలి. ఈ సంఘటనలో ఈ విధానాన్ని అనుసరించనందున, లోకో పైలట్ పై చర్య తీసుకోవాల్సి వచ్చింది” అని రైల్వే అధికారులు తెలిపారు.
గతంలోనూ తమిళనాడులో ఇలాంటి ఘటన
సుమారు ఆరు నెలల క్రితం తిరుచెందూర్ నుంచి పాలక్కాడుకు వెళ్లే రైలు కచ్చానావిలై రైల్వేస్టేషన్ లో ఆగకుండా వెళ్లింది. సుమారు రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత ప్రయాణీకులు ఆలారం చైన్ ను లాగారు. లోకో పైలెట్ ఆది నాథన్ రైలును మళ్లీ వెనక్కి నడిపారు.ఈ ఘటనలోనూ సదరు లోకో పైలెట్ పై రైల్వే అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
Read Also: ఇండియన్ రైల్వేలో హిస్టారికల్ మైల్ స్టోన్.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లింక్ చివరి ట్రాక్ కంప్లీట్!