Patna Water Metro: దేశంలోని మరో ప్రముఖ నగరంలో సరికొత్త జల రవాణా సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు కొచ్చిలో మాత్రమే అందుబాటులో ఉన్న వాటర్ మెట్రో సేవలు ఇప్పుడు బీహార్ రాజధాని పాట్నాలోనూ అందుబాటులోకి వచ్చాయి. గంగా నదిపై ప్రయాణికులు, పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేలా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా తక్కువ ధరలోనే నదిపై ప్రయాణించే అవకాశం కల్పించడం ఈ సర్వీసు ప్రత్యేకత.
బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తాజాగా పాట్నాలో వాటర్ మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ సర్వీసు గంగా నదిపై దీఘా ఘాట్ నుంచి గాంధీ ఘాట్ వరకు నడుస్తుంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి ప్రత్యామ్నాయంగా జల రవాణాను అభివృద్ధి చేయడంతో పాటు నదీ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో ఈ మార్గాన్ని కంగన్ ఘాట్ వరకు విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఈ వాటర్ మెట్రోలో ఒకేసారి 50 మంది ప్రయాణించవచ్చు. ఇందులో హైబ్రిడ్ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. ఈ నౌక విద్యుత్ తో పనిచేస్తుంది. దీంతో గాలి, నీరు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇందులో ఏసీ, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, టాయిలెట్లు లాంటి సదుపాయాలు కల్పించారు. అంతేకాకుండా వీల్‌చైర్ ఉపయోగించే వారు కూడా సులభంగా ప్రయాణించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పాట్నా వాటర్ మెట్రోలో ప్రయాణించాలనుకునే పెద్దలకు టికెట్ ధర రూ.50గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఐదు నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు పెద్దల టికెట్ ధరలో సగం మాత్రమే వసూలు చేస్తారు. ప్రస్తుతం ఈ సర్వీసులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు దీఘా ఘాట్‌లోని టికెట్ కౌంటర్ దగ్గర టికెట్లు కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
వాటర్ మెట్రో కోసం దీఘా, గాంధీ ఘాట్‌ల వద్ద ఫాస్ట్ ఛార్జింగ్, షోర్ ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. దీంతో నౌకకు అవసరమైన విద్యుత్ ఛార్జింగ్ సులభంగా అందుబాటులో ఉంటుంది. మరోవైపు బీహార్ ప్రభుత్వం సోన్, గండక్, కోసి నదులపై కూడా ఇలాంటి ప్రయాణికుల, పర్యాటక సేవలను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ, బీహార్ ప్రభుత్వ అధికారులతో స్పెషల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే బీహార్‌లో జల రవాణా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
Read Also: పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!