E-Paper
Advertisement

Chikmagalur Tourism: వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరుకు దగ్గర్లోని ఈ అద్భుత హిల్ స్టేషన్‌ను మిస్ అవ్వకండి!

Chikmagalur Tourism: వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరుకు దగ్గర్లోని ఈ అద్భుత హిల్ స్టేషన్‌ను మిస్ అవ్వకండి!
Advertisement

Chikmagalur Tourism: ప్రకృతి మనిషికి ఇచ్చిన అత్యంత అందమైన కానుక ఏదైనా ఉందంటే.. అది నిశ్చలమైన కొండకోనలు, పచ్చని అడవులు, వెండి జలపాతాల కలయిక. అచ్చం ఇలాంటి అనుభూతినే ఇచ్చే ఒక అద్భుతమైన ప్రాంతం మన దక్షిణ భారతదేశంలో ఉంది. అదే కర్ణాటకలోని కాఫీ కప్పు అని పిలవబడే చిక్కమంగళూరు. పశ్చిమ కనుమల ఒడిలో ఒదిగిపోయిన ఈ ప్రాంతం పర్యాటకుల పాలిట స్వర్గధామం. ఈరోజు మనం ఈ చల్లని అందాల నగరం గుండా ప్రయాణిస్తూ, అక్కడి విశేషాలను తెలుసుకుందాం.

కాఫీ తోటల మధ్య చక్కగా విస్తరించిన పర్వతాల రహస్యం

కర్ణాటక రాష్ట్రంలో ముల్లయన్ గిరి పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో చిక్కమంగళూరు హిల్ స్టేషన్ ఉంటుంది. ఎత్తైన పర్వతాలు, విస్తారమైన కాఫీ తోటలు, సెలయేళ్లు, జలపాతాలు, ఉద్యానవనాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చిక్క మంగళూరు చుట్టూ ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు

Advertisement

ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు కర్ణాటకలోని ముళ్ళయ్యనగిరి ఒక కలల గమ్యస్థానం. పశ్చిమ కనుమల బాబా బుడాన్ గిరి శ్రేణుల్లో కొలువుదీరిన ఈ శిఖరం.. సముద్ర మట్టానికి సుమారు 1,930 మీటర్ల ఎత్తులో ఉండి.., కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా రికార్డు సృష్టించింది. ముళ్ళయ్యనగిరి పర్వతారోహణను ఇష్టపడే వారికి ఒక గొప్ప వేదిక. గాలిలో తేలియాడే మేఘాల మధ్య, నిటారైన కొండ కోనలను అధిరోహించడం సాహస ప్రియులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుంది. ఈ పర్వత ప్రాంతం అంతా పచ్చని తివాచీ పరిచినట్లుండే గడ్డి భూములతో నిండి ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఆకాశం రంగులు మారుతుంటే, కొండల పైనుంచి కనిపించే దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు ఉంటాయి. శిఖరాగ్రాన వెలిసిన ముళ్ళప్ప స్వామి దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని చేకూరుస్తుంది.

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయా..?

ప్రకృతి రమణీయతకు నిలయమైన చిక్కమంగళూరు జిల్లాలో ఆధ్యాత్మికతకు, మత సామరస్యానికి చిరునామాగా నిలుస్తోంది బాబా బుడాన్ పర్వత శ్రేణి. జిల్లాకు ఉత్తర దిశగా పశ్చిమ కనుమల మధ్య విస్తరించి ఉన్న ఈ పర్వతాలు, కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా, హిందూ-ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బాబా బుడాన్ గిరిని చంద్రద్రోణ పర్వతం అని కూడా పిలుస్తారు. ప్రసిద్ధ సూఫీ సెయింట్ హజ్రత్ దాదా హయత్ ఖలాందర్ నివాస ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు ఆయన్ని ప్రేమగా బాబా బుడాన్ అని పిలుచుకుంటారు. ఇక్కడ ఉన్న పురాతన మందిరం హిందువులకు, ముస్లింలకు సమానమైన పవిత్ర స్థలం. హిందువులు దీనిని దత్త పీఠంగా కొలిస్తే, ముస్లింలు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక్కడి కొండ పైనుండి జారే మాణిక్యధార జలపాతంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

రెండు అంచెలుగా జారే ప్రకృతి దృశ్యం

Advertisement

పశ్చిమ కనుమల రాణి..కెమ్మణ్ణుగుండి. చిక్కమంగళూరు పట్టణానికి ఉత్తరంగా సుమారు 55 కిలోమీటర్ల దూరంలో, బాబా బుడాన్ గిరి పర్వత శ్రేణులలో నెలకొన్న అద్భుతమైన హిల్ స్టేషన్ కెమ్మణ్ణుగుండి. సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం, ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు ఒక గొప్ప గమ్యస్థానం. కెమ్మణ్ణుగుండిని కె.ఆర్. హిల్స్ అని కూడా పిలుస్తారు. మైసూర్ మహారాజు నాల్గవ కృష్ణరాజ వడియార్ ఈ ప్రాంతపు అందాలకు ముగ్ధుడై, దీనిని తన వేసవి విడిదిగా మార్చుకున్నారు. కెమ్మణ్ణుగుండి ప్రధాన కేంద్రం నుండి సుమారు 30 నిమిషాల ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. పశ్చిమ కనుమల లోతైన లోయలు, గడ్డి భూముల ఆకాశ వీక్షణ ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోజ్ గార్డెన్‌లో నడవడం పర్యాటకులకు ఎంతో హాయినిస్తుంది. కెమ్మణ్ణుగుండి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే హెబ్బే జలపాతం రెండు అంచెలుగా జారుతుంది. కల్హత్తి జలపాతం దీనినే కాళహస్తి జలపాతం అని కూడా అంటారు. ఇక్కడ నీరు కొండ పైనుండి జారి పురాతన వీరభద్రేశ్వర ఆలయంపై పడుతుంది.

కొండకు చేరుకునే ప్రతి అడుగు సవాల్

చిక్కమంగళూరు పట్టణానికి నైరుతి దిశలో సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుదురేముఖ్ పర్వత శ్రేణి.. కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో ఒకటి. సముద్ర మట్టానికి 1,894 మీటర్ల ఎత్తులో ఉండే ఈ శిఖరం, తన ప్రత్యేకమైన ఆకారం, జీవవైవిధ్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ పర్వతం ఒక వైపు నుండి చూస్తే ఖచ్చితంగా గుర్రం ముఖం ఆకారంలో కనిపిస్తుంది. అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ కొండలు, ఒకదానితో ఒకటి గొలుసుకట్టుగా అల్లుకుని, లోతైన లోయలతో గంభీరంగా కనిపిస్తాయి.
కుదురేముఖ్ నేషనల్ పార్క్.. ప్రపంచంలోని అత్యుత్తమ జీవవైవిధ్య కేంద్రాలలో ఒకటి. ఇక్కడ దట్టమైన అడవులు, షోలా గడ్డి భూములు ఉన్నాయి. సాహస ప్రియులకు ఇది ఒక గొప్ప సవాల్. కుదురేముఖ్ శిఖరాన్ని చేరుకోవడానికి చేసే ట్రెక్కింగ్ మార్గం అంతా పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే గడ్డి భూముల గుండా సాగుతుంది. కుదురేముఖ్ సమీపంలో ఉన్న హనుమాన్ గుండి జలపాతం.. దాదాపు 100 అడుగుల ఎత్తు నుండి పడుతుంది.

దీపావళి పండుగలో మాత్రమే దర్శనార్థం

చిక్కమంగళూరు ప్రాంతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దైవం దేవిరమ్మ. ఈ ప్రాంతంలో అనేక దేవిరమ్మ ఆలయాలు ఉన్నప్పటికీ, బాబా బుడాన్ గిరి సమీపంలోని దేవిరమ్మ బెట్ట అత్యంత ప్రసిద్ధి. ఈ కొండ చాలా నిటారుగా, సూదిగా ఉంటుంది. ఇక్కడి విశేషమేమిటంటే.. ఈ కొండపైన ఉన్న ప్రధాన ఆలయం కేవలం దీపావళి పండుగ మొదటి రోజు మాత్రమే తెరుస్తారు. ఆ ఒక్క రోజే లక్షలాది మంది భక్తులు ఆ కఠినమైన కొండను ఎక్కి దేవిని దర్శించుకుంటారు. ఒకవేళ మీరు ఆ సమయంలో వెళ్లలేకపోతే, కొండ దిగువన ఉన్న బిండిగ అనే గ్రామంలో కొత్తగా నిర్మించిన దేవిరమ్మ ఆలయాన్ని సందర్శించవచ్చు.

ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు ప్రధాన మఠాలు

చిక్కమంగళూరు పట్టణానికి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ కనుమల పచ్చని ఒడిలో శృంగేరి పుణ్యక్షేత్రం ఉంది. ఇది అద్వైత వేదాంత ప్రవక్త అయిన ఆది శంకరాచార్యులు భారతదేశం నలుమూలలా స్థాపించిన నాలుగు ముఖ్యమైన మఠాలలోమొదటిది.
శంకరాచార్యులు తన దేశాటనలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, తుంగా నది తీరాన ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. మండుటెండలో ఒక నాగుపాము తన పడగను విప్పి, ప్రసవ వేదనలో ఉన్న ఒక కప్పకు నీడను ఇస్తోంది. సహజ శత్రువుల మధ్య ఉన్న ఆ ప్రేమను చూసి పరవశించిన శంకరులు, ఇది తపస్సుకు అత్యంత ప్రశాంతమైన, పవిత్రమైన చోటని భావించి ఇక్కడ మఠాన్ని స్థాపించారు. ఇక్కడ కొలువై ఉన్న శారదా దేవిని జ్ఞానానికి, చదువుకు అధిదేవతగా ఆరాధిస్తారు.

ప్రకృతి ప్రియుల పరిపూర్ణ గమ్యం

చిక్కమంగళూరు పర్యటనలో ప్రకృతి ప్రేమికులు అస్సలు మిస్ అవ్వకూడని మరో అద్భుతమైన ప్రదేశం భద్ర వన్యప్రాణి అభయారణ్యం. దీనిని ముత్తొడి వన్యప్రాణి అభయారణ్యం అని కూడా పిలుస్తారు. చిక్కమంగళూరు పట్టణానికి వాయువ్య దిశలో సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం, పశ్చిమ కనుమల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ పులులతో పాటు చిరుత పులులు, ఏనుగులు,అడవి ఎద్దులు, ఎలుగుబంటి, సాంబార్ జింకలు, మొరిగే జింకలు కనిపిస్తాయి. ఇక్కడ 250కి పైగా రకాల పక్షులు ఉన్నాయి. గ్రేట్ హార్న్‌బిల్, మలబార్ ట్రోగన్ వంటి అరుదైన పక్షులను ఇక్కడ చూడవచ్చు. అభయారణ్యం లోపలికి వెళ్లడానికి అటవీ శాఖ జీప్ సఫారీలను నిర్వహిస్తుంది. భద్ర డ్యామ్ వెనుక వైపు ఉన్న నీటిలో బోటింగ్ కూడా చేయొచ్చు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బస చేసే సౌకర్యం ఉంది. రాత్రి వేళ అడవిలోని నిశ్శబ్దాన్ని, పక్షుల అరుపులను ఆస్వాదించవచ్చు.

చిక్కమంగళూరు రోడ్డు మార్గం

చిక్కమంగళూరుకు రోడ్డు ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. బెంగళూరు నుండి చిక్కమంగళూరు సుమారు 245 కిలోమీటర్ల దూరం. జాతీయ రహదారి 75 నుంచి హాసన్ మీదుగా వెళ్లవచ్చు. బెంగళూరు, మంగళూరు, మైసూర్, హుబ్బళ్ళి నుండి నిరంతరం బస్సులు నడుస్తుంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ సౌకర్యం కూడా ఉంది. చిక్కమంగళూరు సమీపంలో కడూర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది చిక్కమంగళూరు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, మైసూర్, హుబ్బళ్ళి వైపు వెళ్లే అన్ని ప్రధాన రైళ్లు కడూర్‌లో ఆగుతాయి. ఇక్కడ దిగి టాక్సీ, బస్సు ద్వారా 45 నిమిషాల్లో చిక్కమంగళూరు చేరుకోవచ్చు. చిక్కమంగళూరుకు సమీపంలో మంగళూరు, బెంగుళూరు ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఇక్కడ దిగి కారు, బస్సులో వెళ్లవచ్చు.

ప్రకృతి ఒడిలో దాగిన అద్భుత నిధి

చూశారుగా.. చిక్కమంగళూరు అంటే ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుత నిధి. కెమ్మణ్ణుగుండి లోయలు, కుదురేముఖ్ పచ్చదనం, ముళ్ళయ్యనగిరి ఎత్తులు, బాబా బుడాన్ గిరి ఆధ్యాత్మికత.. ఇవన్నీ కలిస్తేనే చిక్కమంగళూరు. కాంక్రీట్ జంగిల్ లాంటి నగర జీవితం నుండి కొంచెం విరామం కోరుకునే వారికి, ఈ వేసవిలో…ఎండల నుంచి ఉపశమనం పొంది..చల్లని ప్రకృతిని అస్వాదించాలనుకునే వారికి..ఇది ఒక చక్కని గమ్యస్థానం.

Also Read: ఎన్నడూ చూడని ఎండ! కొత్త రిసెర్చ్‌లో షాకింగ్ విషయాలు

Story by: Kanugula Kishan, Big Tv

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×