Kerala KSRTC Luxury Bus: ప్రభుత్వ బస్సు అంటే సాధారణంగా రద్దీ, సాధారణ సీట్లు, పరిమిత సౌకర్యాలే గుర్తుకు వస్తాయి. కానీ, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(KSRTC) ఈ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని అందించేందుకు ప్రీమియం బస్సు సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ప్రీమియం బస్సు తిరువనంతపురం నుంచి కొచ్చి మధ్య నడుస్తోంది. ఈ రెండు నగరాల మధ్య దాదాపు 200 నుంచి 227 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా ఇంత దూరం బస్సులో ప్రయాణించేటప్పుడు సౌకర్యాల విషయంలో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కొత్త సర్వీస్‌లో అలాంటి సమస్యలు తగ్గించేలా ఏర్పాట్లు చేశారు. వ్లాగర్ అజయ్ జానీ ఈ బస్సులో ప్రయాణిస్తూ అక్కడ ఉన్న సౌకర్యాలను వీడియో ద్వారా చూపించారు. విమానాల్లోని బిజినెస్ క్లాస్ ప్రయాణాన్ని గుర్తుచేసేలా బస్సు ఇంటీరియర్‌ను రూపొందించారని చెప్పుకొచ్చారు.
బస్సులోకి అడుగుపెట్టగానే ప్రత్యేకంగా కనిపించేది సీట్ల ఏర్పాటు. ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన లెదర్ సీట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి సీటు దగ్గర ప్రత్యేక ఎంటర్ టైన్‌మెంట్ స్క్రీన్ ఉండటం ఆకట్టుకుంటుంది. దీంతో ప్రయాణికులు తమకు నచ్చిన కంటెంట్‌ను చూస్తూ ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణంలో సమయం గడపడానికి అనుకూలంగా ఉంటుంది.
ఇప్పటి రోజుల్లో ప్రయాణికులకు ఇంటర్నెట్, మొబైల్ ఛార్జింగ్ చాలా అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని బస్సులో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించారు. సీట్ల దగ్గరే మొబైల్ ఛార్జింగ్ పోర్టులను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణంలో పని చేసుకునేవారికి, ఆన్‌లైన్‌లో ఉండాల్సిన వారికి కొంత వెసులుబాటు కలుగుతుంది.
ఈ సర్వీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం హోస్టెస్. విమానాల్లో ప్రయాణికులకు సహాయం చేసే సిబ్బంది తరహాలో బస్సులో కూడా హోస్టెస్ సేవలను అందిస్తున్నారు. వీడియోలో హోస్టెస్ ప్రయాణికులకు వేడి పానీయాలు, షవర్మా రోల్ లాంటి స్నాక్స్ అందిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో సాధారణ బస్సు ప్రయాణానికి భిన్నమైన అనుభూతి కలుగుతోంది.
దూర ప్రయాణాల్లో ప్రయాణికులు ఎదుర్కొనే మరో ఇబ్బంది వాష్‌రూమ్. దీనికి కూడా ఈ బస్సులో పరిష్కారం చూపించారు. ప్రయాణికుల కోసం బస్సులోనే ప్రత్యేక వాష్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. సుదీర్ఘ ప్రయాణం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ బస్సుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కేరళ ఆర్టీసీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ రైల్వేలో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న అనంత్ రూపనగుడి కూడా ఈ వీడియోను షేర్ చేసి ఈ ప్రయత్నాన్ని అభినందించారు.
Read Also: టెస్లా సైబర్ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!